
జక్కంపూడి కాలనీలో కార్డన్ సెర్చ్
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో బుధవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలనీలోని 20 బ్లాకుల్లోని 640 ప్లాట్లలో నివాసం ఉంటున్న ఆయా కుటుంబీకుల వివరాలు, ఆధార్ కార్డులను పోలీసులు తనిఖీ చేశారు. ఇన్‌చార్జి డీసీపీ గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు పర్యవేక్షణలో కొత్తపేట సీఐ చిన్న కొండలరావు, వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్, సీఐలు చంద్ర శేఖర్, ఉమామహేశ్వరరావు, కృష్ణమోహన్, లక్ష్మీనారాయణలతోపాటు పలుస్టేషన్లకు చెందిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలతో కలిపి మొత్తం 130మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఇళ్లలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనని క్షుణ్నంగా పరిశీలించారు. ఆయా ప్లాట్లలో ఎంత కాలం నుంచి నివాసం ఉంటున్నారు..మీ చుట్టు పక్కల కొత్తగా ఎవరైనా అద్దెకు వచ్చారా..వారేమైనా అనుమానాస్పదంగా ఉన్నారా అని కాలనీవాసులను ఆరా తీశారు. కాలనీలో ఎవరైనా మద్యం, గంజాయి, ఇతర మత్తుమందులు విక్రయిస్తున్నారా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ ద్వారా కాలనీ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ ఐరీష్ వాహనం ద్వారా 128మందికి ఐరీష్ తీయగా వారిలో ఐదుగురు అనుమానితులు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 350 బైక్‌లు, ఆటోల రికార్డులు పరిశీలించారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేని 50 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జక్కంపూడి కాలనీలో కార్డన్ సెర్చ్