
పల్లె పండుగ నిధులు మంజూరు ఎప్పుడో?
జగ్గయ్యపేట: ఉపాధి హామీ పథకంలో భాగంగా గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆర్భాటంగా పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాల పేరుతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా మంజూరుకాలేదు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సిమెంట్ రోడ్లు, గ్రావెల్ పనులు, రోడ్డు చదు ను, పశువులషెడ్లు పనులకు బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయోనని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
624 పనులు కేటాయింపు...
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 16మండలాల్లో కలిపి రూ. 94.32కోట్ల విలువగల 624 పనులకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించారు. వీటిలో 535 పనులు పూర్తికాగా, 63 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. వత్సవాయి మండలంలో ఐదు పనులు, విజయవాడ–2, పెనుగంచిప్రోలు–4, వీరులపాడు–5, కంచికచర్ల–3, నందిగామ–2, ఏ.కొండురు మండలంలో ఐదు పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. పూర్తయిన పనులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కేవలం రూ.6.8కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన నిధులను మంజూరు చేయకపోవడంతో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
720 గోకులం షెడ్లు మంజూరు...
పల్లె పండుగలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 720 పశువుల షెడ్లు మంజూరు కాగా ఇందులో 615 పూర్తయ్యాయి. ఇందులో కనీసం పదిశాతం నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. 559 షెడ్లకు సంబంధించి రూ.9కోట్ల మేర బిల్లులు ఇవ్వలేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి షెడ్లు నిర్మాణం పూర్తిచేసుకుంటే ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదంటూ రైతులు వాపోతున్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు, గోకులం షెడ్ల లబ్ధిదారులు కోరుతున్నారు.
జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల పనులు
పదిశాతం నిధులు కూడా ఇవ్వని కూటమి ప్రభుత్వం
బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు
గోకులం షెడ్ల సబ్సిడీ నిధుల కోసం
లబ్ధిదారుల వేడుకోలు
బడ్జెట్ రాగానే బిల్లులు చెల్లిస్తాం...
ఉపాధి హామీ పథకం, పంచాయితీరాజ్‌శాఖలో చేసిన పనులకు సంబంధించిన అన్ని బిల్లుల వివరాలను కూడా ప్రభుత్వానికి అందించాం. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే చేసిన పనులకు బిల్లులు చెల్లిస్లాం.
–ఏ.రాము,
డ్వామా పీడీ, విజయవాడ