
టాప్ లేపిన అన్నదమ్ములు
మచిలీపట్నంఅర్బన్: తల్లిదండ్రుల స్ఫూర్తి, ఉపాధ్యాయుల శిక్షణతో ఒకే కుటుంబంలో సొంత అన్నదమ్ములు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కృష్ణాజిల్లా ఫస్ట్, సెకండ్ ర్యాంకర్లుగా నిలిచి శభాష్ అనిపించారు. ఉంగుటూరు మండలం, మధిరపాడు గ్రామానికి చెందిన దుబ్బాకుల నరసింహారావు, నాగదుర్గ దంపతులకు దుబ్బాకుల దుర్గాయశ్వంత్, దుబ్బాకుల వీర వెంకట నాగేంద్ర కుమారులు. వీరిరువురూ ఉంగుటూరు మండలం ఇందుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివారు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు కాగా.. తల్లిదండ్రుల కష్టాన్ని, ఉపాధ్యాయుల శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రణాళిక, సమన్వయంతో దుబ్బాకుల దుర్గా యశ్వంత్ 600 మార్కులకుగాను 591 మార్కులు సాధించి కృష్ణాజిల్లా మొదటి స్థానం, అతని తమ్ముడు దుబ్బాకుల వీర వెంకట నాగేంద్ర 589 మార్కులు సాధించి జిల్లా ద్వితీయ స్థానం సాధించాడు.
డీఈఓ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ..
ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు జిల్లా మొదటి, ద్వితీయ ర్యాంకులు సాధించటంతో జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు వారిద్దరిని అభినందిస్తూ వారి ఫొటోలు, సాధించిన మార్కులు, ర్యాంకులతో ఫ్లెక్సీని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. వారుండేది కుగ్రామమైనా, వేదిక ప్రభుత్వ పాఠశాలైనా కళ్లముందున్న లక్ష్యాన్ని.. పట్టుదల, ప్రణాళిక, నిరంతర సాధనతో అందుకోవడం అభినందనీయమని పలువురు అభినందిస్తున్నారు.
‘పది’ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి రెండు ర్యాంకులతో సత్తా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

టాప్ లేపిన అన్నదమ్ములు