
తక్కువ ధరకు ధాన్యం అమ్మొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్మొద్దని మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాంధీనగర్‌లోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుని నష్టపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిల్లర్లు తక్కువ ధరకు కొంటున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేని ధాన్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఉండొచ్చని వివరించారు. మిల్లర్లు ఏవైనా అవకతవకలకు పాల్పడితే అసోసియేషన్ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పులిపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి అన్నే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు