
కొవ్వొత్తులతో ముస్లింల శాంతి ర్యాలీ
చల్లపల్లి: కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. చల్లపల్లి–మచిలీపట్నం రహదారిలోని పెద్ద మసీదు వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన సెంటర్ నుంచి వైశ్యబజార్ మీదుగా సాగింది. కొవ్వొత్తులు వెలిగించి చనిపోయినవారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. కులమతాల భేదాలు వద్దు.. ఐకమత్యమే ముద్దు, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి.. అంటూ నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ముస్లిం మత గురువు ఇమామ్, పెద్ద మసీదు కమిటీ అధ్యక్షుడు నసీం ఘోరి, గౌసియా మసీదు అధ్యక్షుడు షేక్ అబూ షరీఫ్, చల్లపల్లి, నారాయణరావునగర్‌కు చెందిన ముస్లిం పెద్దలు, యువత, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.