
చెరువులో పడి చిన్నారి మృతి
గూడూరు: ప్రమాదవశాత్తూ చెరువులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఆకుమర్రు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కమ్మగంటి నవనీత్(5), అతని అన్న నిహాక్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం గ్రామ శివార్లలోని బాపనకోనేరు చెరువు దగ్గర బహిర్భూమికి వెళ్లారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తూ నవనీత్ చెరువలో పడి మరణం చెందాడు. కళ్లెదుటే ఆటలాడుకుంటున్న తమ్ముడు నవనీత్ చెరువులో పడిపోవడంతో భయాందోళనకు గురైన నిహాక్ వెంటనే ఊరిలోకి వచ్చి కనపర్తి ఆశీర్వాదం అనే వ్యక్తికి విషయం చెప్పాడు. దీంతో ఆశీర్వాదం చెరువు దగ్గరకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టేసరికే నవనీత్ నీటిలో పడి ఊపిరాడక విగతజీవిగా మారాడు. తల్లిదండ్రులు కమ్మగంటి రత్నకుమారి, శివనాగరాజులు కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై శివనాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు ఎస్‌ఐ కేఎన్‌వీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆస్పత్రిలో బాలుడి మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. చెరువును అక్రమంగా తవ్వడంతోనే తమ కుమారుడు చనిపోయాడని కమ్మగంటి శివనాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ సర్పంచి బొల్లా కృష్ణకుమారితో పాటు గ్రామ నాయకుడు కారుమంచి కామేశ్వరరావులపై ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు.