
బైక్‌లు చోరీ చేస్తూ.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట
విజయవాడస్పోర్ట్స్: దొంగిలించిన బైక్‌లను విక్రయించగా వచ్చిన డబ్బులతో గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముఠాను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.5 కేజీల గంజాయి, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్ద టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారి వివరించారు. గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు అంశాలపై పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్న పాత నేరస్తులపై దృష్టి సారించామని చెప్పారు. ఈ క్రమంలో మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గులాబీతోటతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎ.మనోజ్‌పార్ధు(గులాబీతోట), షేక్ అలీబాబా(పెనమలూరు)లను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులిద్దరూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం, గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్‌లను దొంగిలించడం, ఆ వాహనాలపై ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వాహనాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో గంజాయిని కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువస్తారని తెలిపారు. ఇదే గంజాయిని స్థానిక యువతకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడాన్ని నిందితులిద్దరూ వృత్తిగా చేసుకుని జీవిస్తున్నట్లు చెప్పారు. ఈ ముఠా సభ్యులు ఐదుగురు ఉన్నారని, వీరంతా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారన్నారు. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి రూ.60 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీధర్, రవికుమార్ పాల్గొన్నారు.