
నేను పంపిన ట్రాక్టర్లర్లకు ఇసుక పంపిస్తావా..
కర్నూలు: తాను పంపిన ట్రాక్టర్లకు ఇసుకను నింపి పంపించాలని హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన దుబ్బలింగను ఆలూరు సీఐ ఆర్. ఈశ్వరయ్య బెదిరించారు. ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గ్రామానికి సమీపంలో ఉన్న వేదావతి నది నుంచి దుబ్బలింగ తనకున్న ట్రాక్టర్ల ద్వారా ఇసుకను వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ ఫోన్ ద్వారా దుబ్బలింగతో మాట్లాడారు.
‘‘అక్రమంగా వేదావతి నదిలో ఇసుక రవాణా చేస్తున్నావు.. నేను పంపుతున్న ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇసుక ఎత్తి పంపు’ అని సూచించారు. వేదావతి నది సమీపంలో ఉన్న పొలం యజమాని ఇసుక ట్రాక్టర్లును రస్తాను వదలడం లేదని దుబ్బలింగ సమాధానం చెప్పారు. దీంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘అందరికీ ఇసుక రవాణాను చేసుకోవడానికి ఎలా రస్తా ఇచ్చారు.. నేను పంపిన ట్రాక్టర్లర్లకు ఇసుక పంపిస్తావా..లేదంటే అంతా బంద్ చేస్తావా..సీఐ అంటే ఎవరికీ లెక్కలేకుండా పోయింది’’ అని బెదిరించాడు.
ఈ విషయంపై సీఐ ఆర్. ఈశ్వరయ్య మాట్లాడుతూ..పోలీసు సర్కిల్ కార్యాలయ మరమ్మతులకు సంబంధించి మాత్రమే నేను పంపిన ట్రాక్టర్‌కు ఇసుకను పంపాలని కోరానన్నారు. అందుకు తగిన నగదును చెల్లిస్తానని దిబ్బలింగకు చెప్పానన్నారు.