నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

Published Wed, Jul 5 2023 1:14 AM | Last Updated on Wed, Jul 5 2023 1:13 PM

నకిలీ నోట్ల ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టి  వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీరాం   - Sakshi

నకిలీ నోట్ల ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీరాం

కర్నూలు: నకిలీ కరెన్సీ (నోట్లు) ముఠా గుట్టు రట్టయ్యింది. పుల్లయ్య ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో రెండు గ్రూపులకు చెందిన ఎనిమిది మంది నోట్ల బ్యాగులు మార్చుకుంటుండగా అర్బన్‌ తాలూకా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఆలూరు గ్రామానికి చెందిన కరిడికొండ గంగాధర్‌, కర్నూలు ధర్మపేటకు చెందిన అరేకల్‌ కుమార్‌, క్రిష్ణగిరి మండలం ఎరుకలిచెరువు గ్రామానికి చెందిన ఈడిగ జయన్న, కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన బోయ బంగి పరుశురాముడు ఒక ముఠాగా, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన జనుపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, బంగిపోగు చిన్ననాగన్న, చాకలి బ్రహ్మ, కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన కమ్మరి వీరేష్‌ ఆచారి తదితరులు మరో ముఠాగా ఏర్పడ్డారు. వీరు పుల్లయ్య ఇంజినీరింగ్‌ కాలేజీ పక్కన అపూర్వ హోమ్స్‌కు వెళ్లే రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో మంగళవారం డీల్‌ ప్రకారం ఒకరి ఒకరు బ్యాగులు మార్చుకుంటుండగా పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. అదుపులోకి తీసుకొని బ్యాగులను పరిశీలించగా అందులో నకిలీ నోట్లు బయటపడ్డాయి.

ఒకరినొకరు మోసం చేసుకునే క్రమంలో...
ఒక బ్యాగులో 17 బండిల్స్‌ ఉండగా, అందులో కింద, పైన ఒరిజినల్‌ రూ.500 నోట్లు పెట్టి మధ్యలో రూ.87,50,000 నకిలీ నోట్లు ఉన్నాయి. అలాగే రెండో గ్రూపునకు చెందిన బ్యాగులో పరిశీలించగా అందులో సుమారు రూ.16.30 లక్షల నకిలీ నోట్లు బయటపడ్డాయి. మొదటి ముఠా వారు రూ.90 లక్షలు నకిలీ కరెన్సీ ఇస్తే రెండో గ్రూపు వారు రూ.30 లక్షలు ఒరిజినల్‌ కరెన్సీ ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒరిజినల్‌ నోట్లు ఇస్తామన్న ముఠా కూడా నకిలీ నోట్లతో వెళ్లి ఒకరినొకరు మోసం చేసుకునే క్రమంలో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

కర్నూలు అర్బన్‌ తాలూకా సీఐ శ్రీరాం, ఎస్‌ఐలు రామయ్య, సమీర్‌ బాషా, మన్మథ విజయ్‌ తదితరులతో కలసి సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రెండు ముఠాల నుంచి రూ.1,03,51,000 నకిలీ నోట్లు (సినిమా షూటింగ్‌ కోసం వినియోగించే నోట్లు), రూ.29 వేలు ఒరిజినల్‌ నోట్లతో పాటు మూడు మోటర్‌ సైకిళ్లు స్వా ధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తెలిపారు. దొంగ నోట్ల ముఠాను పట్టుకుని వారి నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నందుకు క్రైం పార్టీ సిబ్బంది ఏఎస్‌ఐ ఆచారి, హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుళ్లు మంజుకుమార్‌, రామ్‌ప్రసాద్‌, సుధీర్‌ తదితరులను సీఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement