హరహర మహాదేవ!
అశేష భక్తజనం మధ్య మల్లన్న రథోత్సవం, (ఇన్‌సెట్) చిన్నారి భక్తిభావం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న రథోత్సవం నయన మనోహరంగా సాగింది. మహాశివరాత్రి రోజు శ్రీభ్రమరాంబాదేవిని వివాహ మాడిన మల్లికార్జునస్వామి గురువారం సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఓం నమఃశివాయ, శంభో..శంకర అని భక్తులు నినదిస్తుండగా రథోత్సవం కనుల పండువగా సాగింది. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గంగాధర మండపం వద్దకు పల్లకీ మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం రథశాల వద్ద అర్చక వేదపండితులు రథాంగపూజ, రథాంగ హోమాది క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను రథంలో ఆశీనులు చేశారు. జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు రథోత్సవ పూజలో పాల్గొన్నారు. అనంతరం సాత్వికబలిగా కొబ్బరికాయ, గుమ్మడికాయలను సమర్పించారు. ఆ తర్వా త భక్తులు శివ నామ స్మరిస్తుండగా.. కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతుండగా రథం ముందుకు కదిలింది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం నిర్వహించారు. రథంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించి నీరాజనాలు సమర్పించారు. ఓం నమఃశివాయ, శంభో శంకర అంటూ భక్తులు పరమేశ్వరుడిని కీర్తించారు. రథోత్సవం ముందు కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డప్పువాయిద్యాలు, గొరవయ్యల నృత్యాలు, భాజాభజంత్రీలు, వివిధ కళాకారుల రూపాలు ఆకట్టుకున్నాయి. రథోత్సవం అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణి వద్ద కనుల పండువగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పుష్కరిణిలో తెప్పపై ఉంచారు. స్వామి అమ్మవార్లు తెప్పపై విహరిస్తుండగా భక్తులు దర్శించుకున్నారు.
వైభవంగా మల్లన్న రథోత్సవం
మారుమోగిన శివనామస్మరణ
కనుల పండువగా తెప్పోత్సవం
నేడు బ్రహ్మోత్సవ క్రతువులకు
యాగ పూర్ణాహుతి
నేడు పూర్ణాహుతి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ యాగాది క్రతువులకు శుక్రవారం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఉదయం స్వామివారి యాగశాలలో అర్చకులు, అధికారులు పూజలు చేసి పూర్ణాహుతి జరపనున్నారు. అనంతరం వసంతోత్సవం, కలశోత్సవం, త్రిశూలస్నా నం చేస్తారు. సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
హరహర మహాదేవ!
హరహర మహాదేవ!
హరహర మహాదేవ!
Comments
Please login to add a commentAdd a comment