రూ.6.91 కోట్లతో నీటి ఎద్దడి నివారణ
కర్నూలు(అర్బన్): ప్రస్తుత వేసవిలో జిల్లాలోని పలు గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.6.91 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు బీ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తలేదని, ఆయా ఎస్‌ఎస్ ట్యాంకుల్లో కూడా నీరు సమృద్ధిగా ఉందన్నారు. రానున్న మార్చి, ఏప్రిల్, మే నెలలను దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలోని ఇంజినీర్ల ద్వారా ఎన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తవచ్చనే అంశంపై సర్వే నిర్వహించి నివేదికలను తెప్పించుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని 25 మండలాల్లోని 721 జనవాసాల్లో 191 జనవాసాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తవచ్చనే అభిప్రాయానికి వచ్చామన్నారు. ఇందులో 76 జనవాసాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లోని ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడరాదని రూ.3.89 కోట్లతో రవాణాతో తాగునీటిని సరఫరా చేయాలని ప్రతిపాదనలు రూపొందించామన్నారు. అలాగే రూ.1.2 కోట్లతో సమీప గ్రామాల్లో నీటి సోర్సులను అద్దెకు తీసుకోవాలని, ఎస్‌ఎస్ ట్యాంకులను నింపేందుకు రూ.5 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనాకు వచ్చామన్నారు. రూ.2.95 కోట్లతో బోర్లలో డీపెనింగ్, ఫ్లష్సింగ్ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించామన్నారు. ఆదోని, కౌతాళం, ఆస్పరి, పెద్దకడుబూరు, కోసిగి, మద్దికెర, తుగ్గలి, వెల్దుర్తి మండలాల్లోని 115 గ్రామాలకు రవాణాతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చనే అభిప్రాయం మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బీ నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment