‘కూటమి’ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
ఆదోని టౌన్: రాష్ట్రంలోని ‘కూటమి’ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ కృష్ణమోహన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆదోని పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల్లో ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడమే లక్ష్యంగా పెట్టుకోవడం దారుణమన్నారు. ఆదోని పట్టణంలోని భీరప్పస్వామి దేవాలయ ఆవరణలో ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. దళిత మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, మహిళా నాయకురాళ్లు శ్రీదేవి, సుగుణ, సుభాషిణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment