దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరు
ఆలూరు: బాల్యంలో చేయి పట్టుకుని ప్రపంచాన్ని చూపించిన, మంచి నేర్పించిన తండ్రి ఇక లేరు..పుట్టినప్పటి నుంచి లాలన పంచి, మమకారంతో పెంచిన అమ్మ ఇక రాదు.. ఎంతో కష్టాన్ని భరించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేరనే దుఃఖంలోనే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు బుధవారం పరీక్ష రాశారు. కంట నీరు వస్తున్నా అమ్మానాన్నలు పెట్టుకున్న ఆశలు, తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు పరీక్షకు హాజరయ్యారు. ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన సాయి పోగు భగీరత, భార్య శ్రీదేవి దంపతుల నాలుగో కుమారుడు సాయిపోగు రామకృష్ణ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. ఈ నెల 18న హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో మిర్చి పంటను కోసేందుకు శ్రీదేవి (47) కూలి పనికి వెళ్లారు. పొలం సమీపంలోని ఎల్లెల్సీలో నీటిని తాగేందుకు వెళ్లి కాలు జారి పడి మృతి చెందారు. తల్లి మృతి చెందిన బాధను దిగమింగుకుని ఆలూరు ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాల పరీక్ష కేంద్రంలో సాయిపోగు శివరామకృష్ణ బుధవారం హిందీ పరీక్ష రాశారు.
తండ్రి మరణించినా..
ఆలూరులోని మెయిన్ ఉర్దూ పాఠశాలలో మహ్మద్ ముజమల్ అనే విద్యార్థి పదో తరగతి చదివారు. మంగళవారం తెల్లవారు జామున విద్యార్థి తండ్రి నూర్‌మహ్మద్ (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఆ బాధతోకూడా బుధవారం ఉదయం పరీక్ష కేంద్రానికి మహ్మద్ ముజమల్ చేరుకున్నారు. హిందీ పబ్లిక్ పరీక్షను రాశారు. తండ్రి మరణించిన దుఃఖంలోనూ పరీక్షకు హాజరైన విద్యార్థి మహ్మద్ ముజమల్‌ను ఉపాధ్యాయులు అభినంధించారు.
దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరు
Comments
Please login to add a commentAdd a comment