కన్నీటి సాగు.. కనిపించదా కరువు! | - | Sakshi
Sakshi News home page

కన్నీటి సాగు.. కనిపించదా కరువు!

Published Sun, Mar 30 2025 2:30 PM | Last Updated on Sun, Mar 30 2025 2:30 PM

కన్నీటి సాగు.. కనిపించదా కరువు!

కన్నీటి సాగు.. కనిపించదా కరువు!

కేవలం 15 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రతిపాదనలు

నేడో, రేపో కరువు మండలాలను ప్రకటన

రబీలో తీవ్రంగా నష్టపోయిన రైతులు

రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దనే తప్పుడు లెక్కలు

కర్నూలు(అగ్రికల్చర్‌): వరుణుడు కరుణించడు.. సాగునీరు పారదు.. పొలం పండదు.. అన్నదాతకు అప్పులే మిగులుతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కరువు కనిపించదు. కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు ఒక ప్రకటన వస్తుంది. ఖరీఫ్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని మండలాల్లో కరువు పరిస్థితి ఉండగా కేవలం రెండు మండలాల పేర్లు వచ్చాయి. రబీ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్టోబరు నుంచి మార్చి నెల వరకు డిసెంబరు నెలలో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలిన నెలల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పంటలు వేసినా దిగుబడులు రాక.. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నా.. కేవలం 15 మండలాల్లోనే కరువు ఉన్నట్లు నివేదికలు వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దనే సూచనలతో అధికారులు తప్పుడు లెక్కలు పంపారనే విమర్శలు ఉన్నాయి.

ఇదీ దుస్థితి..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 55 మండలాలు ఉన్నాయి. పంటలు పండక, దిగుబడులు రాక రైతులకు తీవ్ర నష్టాలు వచ్చినప్పటికీ 2024 ఖరీఫ్‌ సీజన్‌లో కౌతాళం, పెద్దకడుబూరు మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించారు. రబీ సీజన్‌లో వర్షాలు లేక సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సాగు చేసిన పంటలు కూడా పొగమంచు కారణంగా దెబ్బతిన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయినా కేవలం 15 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రతిపాదించారు.

● కర్నూలు జిల్లాలో కల్లూరు, కర్నూలు రూరల్‌, కర్నూలు అర్బన్‌, కోడుమూరు, గూడూరు, ఓర్వకల్లు, ఆస్పరి, వెల్దుర్తి, మద్దికెర, పత్తికొండ మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది.

● నంద్యాల జిల్లాలో సంజామల, బనగానపల్లె, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, బేతంచెర్ల మండలాలను ప్రతిపాదించారు.

● డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్‌ మండలాలు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. రబీలో ఈ మండలాల్లో సాగు భారీగా తగ్గిపోయింది. ఈ మండలాలను జిల్లా యంత్రాంగం పక్కన పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

● జిల్లా యంత్రాంగం పంపించిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో కరువు మండలాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

● కర్నూలు జిల్లాలో కరువు తీవ్రతను తగ్గించి కేవలం 10 మండలాలను, నంద్యాల జిల్లాలో 5 మండలాలను చేర్చారు.

దిగులే మిగిలింది!

రబీ సీజన్‌ అక్టోబరు నుంచి మొదలై మార్చి వరకు కొనసాగుతుంది. కరువు ప్రాంతాలను గుర్తించాలంటే ఆయా నెలల్లో నమోదైన వర్షపాతం వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. డిసెంబరు నెలలో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబరు, నవంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వర్షాలు లేవు. ఐదు నెలల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 27 శాతం లోటు వర్షపాతం ఉంది. జనవరి నుంచి మార్చి వరకు ప్రతి నెల 47 శాతం లోటు వర్షపాతం ఉంది. వర్షాభావంతో శనగ, జొన్న, మినుముల్లో దిగుబడులు 60 శాతం వరకు పడిపోయాయి. ఈ విషయాన్ని పంట కోత ప్రయోగాలు స్పష్టం చేస్తున్నాయి. దిగుబడులు లేక రైతుకు దిగులే మిగిలినా రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

కరువున్నా కరుణ ఏదీ?

గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి ఇప్పటికే వందలాది గ్రామాల్లో తాగునీటికి తీవ్ర సమస్య ఏర్పడింది. పశువులకు సైతం నీరు అందని దుస్థితి నెలకొంది. కరువు మండలాలను గుర్తించడంలో భూగర్భ జలాలు కీలకం. అయి నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుంచి గత ఏడాది నవంబరు నెల నుంచే వలసలు మొదలయ్యాయి. కోసిగి, ఆదోని, పెద్దకడుబూరు, కౌతాళం, హాలహర్వి, హొళగుంద, మద్దికెర, దేవనకొండ, తుగ్గలి, హాలహర్వి తదితర మండలాల నుంచి వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు వలస వెళ్లిపోయారు. రబీ కరువు ప్రతిపాదనల్లో జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పలు మండలాలు లేవు.

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పెద్దకడుబూరు, కౌతాళం కరువు మండలాలకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం జిల్లా యంత్రాంగం డిసెంబరు నెలలోనే ప్రతిపాదనలు పంపింది. ఇంతవరకు రూ.25.24 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఊసే లేకుండా పోయింది.

2023 ఖరీఫ్‌ కరువు మండలాలకు సంబంధించి 41,857 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నందున రూ.60.59 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల కాలేదు. జిల్లా అధికారులు ఖాతాలను సరిచేసి పంపినప్పటికీ నిధుల విడుదల అతీగతీ లేకుండా పోయింది.

2023–24 రబీ కరువు మండలాలకు దాదాపు లక్ష మంది రైతులకు రూ.98 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల పెండింగ్‌లో ఉండిపోయింది. 2023 ఖరీఫ్‌ సీజన్‌, 2023–24 రబీ సీజన్‌, 2024 ఖరీఫ్‌ సీజన్‌లకు సంబందించి పంటల బీమా పరిహారం విడుదల పెండింగ్‌లోనే ఉంది.

భూగర్భ జలాల దుస్థితి ఇదీ...

సాగు విస్తీర్ణం హెక్టార్లలో

హాలహర్వి మండలం చింతకుంట్ల సమీపంలో వరి పైరును జీవాలు మేస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement