
కూటమి నేతల మాటలు నమ్మి మోసపోయాం
కర్నూలు(సెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల మాటలు నమ్మి మోసపోయామని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉగాది రోజు వారు ఇచ్చిన హామీని నమ్మి దగా పడ్డామని, రోడ్డున పడి అడుక్కుతుంటున్నామని వాపోయారు. ఈ ఉగాది వలంటీర్లకు ఉగాది కాదని, దగాది అని వ్యాఖ్యానించారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు వలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నూర్ అహ్మద్ మాట్లాడుతూ పోయిన ఉగాదిన సీఎం, డిప్యూటీ సీఎంలు వలంటీర్లకు రూ.10 వేల వేతనంతో కొనసాగిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి రాగానే సాకులు వేతికి ఉద్యోగులను తొలగించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సరైన జీఓలు ఇవ్వలేదని చెప్పడం అన్యాయమన్నారు. అలాంటప్పుడు ఆ ప్రభుత్వం తమను ఐదేళ్లపాటు ఎలా కొనసాగించిందని ప్రశ్నించారు. ఎలాంటి జీఓలు లేనప్పుడు తమ సేవలను విజయవాడ వరదల సమయంలోఎలా వినియోగించుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుందన్నారు. కార్యక్రమంలో వలంటీర్లు శివ, అనిల్,సునీత, ప్రభావతి, అజ్మతుల్లా, వెంకటేశ్ పాల్గొన్నారు.
కర్నూలు కలెక్టరేట్ ఎదుట వలంటీర్ల ధర్నా