
టెన్నిస్ క్రీడాకారిణికి అభినందన
కర్నూలు(సెంట్రల్): జాతీయస్థాయి టెన్నిస్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించిన డెఫ్ క్రీడాకారిణి షేక్ జఫ్రిన్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ప్రత్యేకంగా అభినందించారు. ఈమె అహ్మదాబాద్‌లో మార్చి 20 నుంచి 23వ తేదీ వరకు జరిగిన పోటీల్లో మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించింది. డబుల్స్‌లో నంద్యాలకు చెందిన సాయి చందన్‌తో కలిసి ప్రతిభ చాటింది. దీంతో 2025 నవంబర్‌లో జపాన్‌లో జరిగే బధిరుల ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో క్రీడాకారిణి జఫ్రిన్‌ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సన్మానించి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల పంపిణీ
విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహకంగా 3 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లను కలెక్టర్ పి.రంజిత్‌బాషా అందించారు. సోమవారం కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు వాటిని అందజేసి చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాక్షించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్వో సీ.వెంకటనారాయణమ్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రాయిస్‌ఫాతిమా, కో–ఆపరేటివ్ అధికారులు రామాంజనేయులు పాల్గొన్నారు.