
కార్పొరేట్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తాం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను 2029 నాటికి కార్పొరేట్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన నూతన 2డీ ఎకో కలర్ డాప్లర్ మిషన్‌ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన 2డీ ఎకో మిషన్ వల్ల శిశువుల నుంచి పెద్దల వరకు గుండె సమస్యలను తెలుసుకునే వీలుందన్నారు. ఈ నెల 19న ఆరోగ్యశాఖ మంత్రి స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శిస్తారన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో ఉన్న మిషన్ 15 సంవత్సరాల వయస్సు గల వారికి ఉపయోగపడేదని, ఈ మిషన్ నెలలోపు పిల్లలను కూడా పరీక్షించేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, కార్డియాలజి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.