
ఆధిపత్యం కోసమే హత్యాయత్నం
ఆళ్లగడ్డ: శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో ఇటీవల జరిగిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఇందూరు ప్రతాపరెడ్డి హత్యాయత్నం ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితుల (ఏ1, ఏ2)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను బుధవారం ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా విలేకరులకు వెల్లడించారు. శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామానికి చెందిన ఇందూరు ప్రతాపరెడ్డి సోదరుడు ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, బావ శ్రీనినాసరెడ్డి 2017లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో గంగదాసరి వెంకట రవిచంద్రారెడ్డి ప్రధాన నిందితుడు కాగా ప్రధాన సాక్షి ఇందూరు ప్రతాపరెడ్డి. కేసు కోర్టులో ట్రైల్‌కు రావడంతో ప్రతాపరెడ్డిని హత్య చేస్తే సాక్ష్యం లేకుండా పోవడంతో పాటు, గ్రామంలో ఆధిపత్యం చెలాయించవచ్చని భావించిన రవిచంద్రారెడ్డి, సంజామల మండలం పేరుసోముల గ్రామం సంద్యపోగుల పక్కీరయ్య, ఉరఫ్ పక్కీర్, ఉరఫ్ సంజీవరెడ్డి, ఉరఫ్ ప్రతాప్‌లు ప్రతాపరెడ్డి గ్రామంలోని ఆలయంలో పూజ చేసేందుకు వస్తాడని తెలుసుకుని ఈనెల 5న కాపుకాశారు. ప్రతాపరెడ్డి రాగానే వేటకొడవళ్లతో విచక్షణారహింతగా నరికి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ప్రతాపరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. కాగా వీరికి మరో ముగ్గురు సహకరించినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, శిరివెళ్ల సీఐ వంశీధర్, ఎస్‌ఐ చిన్నపీరయ్య ఉన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్