
ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు: స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న కరెంటు ఆఫీస్‌లో తన కుమారుడు రమేష్‌కు ఏఈ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అందులో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి రామాంజనేయులు రూ.22 లక్షలు తీసుకుని మోసం చేశాడని, విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా సీతారాం నగర్‌కు చెందిన శాంతమ్మ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 128 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు 18 విడతలుగా రూ.62 లక్షలు వారి ఖాతాలో జమ చేసుకుని మోసం చేశారని కర్నూలుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌లో లింక్ పంపి దానిని క్లిక్ చేసిన తర్వాత ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుందని చెప్పి మొదట రూ.1.20 లక్షలు వారి ఖాతాలో వేయించుకుని తిరిగి డబ్బులు పంపి నమ్మించారని, తర్వాత భారీ మొత్తంలో డబ్బు వేయించుకుని విత్‌డ్రా ఆప్షన్ ఇవ్వకుండా తన మొబైల్ నెంబర్‌ను బ్లాక్ చేసి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేశారని, ఎఫ్‌ఐఆర్ చేయించి ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని కోర్టు నుంచి ఇప్పించాలని బాధితుడు ఎస్పీతో మొర పెట్టుకున్నారు.
● హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కేంద్రంలో డ్రా చేసిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు తన ఏటీఎం కార్డు తీసుకుని మార్పు చేసి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు డ్రా చేసుకుని మోసం చేశారని, సీసీ కెమెరాలో వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎన్‌ఆర్‌పేటకు చెందిన ఇక్బాల్‌బాషా ఫిర్యాదు చేశారు.
● కుమారుడు, కోడలు కలిసి తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇంటిని కూడా వేరేవాళ్లకు రిజిస్ట్రేషన్ చేశామని చెబు తూ మోసం చేస్తున్నారని కర్నూలు నాగిరెడ్డి కా లనీకి చెందిన మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
పీజీఆర్‌ఎస్‌కు 128 ఫిర్యాదులు
సమస్యలు తక్షణమే పరిష్కరించండి
ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల్లో చట్టపరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో 96 వినతులు వచ్చాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన వినతులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.