
ప్రాణం తీసిన విద్యుదాఘాతం
సి.బెళగల్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన బోయ కాలప్ప (40).. సి.బెళగల్ గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కనున్న బండల డిపోలో కట్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం బండల డిపోలో పని చేసుకుంటుండగా వైరు పాడైపోయి ఉండటంతో రేకుల షెడ్‌కు విద్యుత్ ప్రసారం అయ్యింది. గమనించని కాలప్ప.. షెడ్ రేకులను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య లక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని రోదించిన తీరు పలువురను కంటతడి పెట్టించింది. బోయ కాలప్పకు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్యుత్ తీగల నిర్వహణలో బండల డిపో యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు. యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
5 నుంచి రంగస్థల నటనపై శిక్షణ
కర్నూలు కల్చరల్: టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో మే 5వ తేదీ నుంచి రంగస్థల నటనపై శిక్షణ ఇస్తున్నట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో మే 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎంపికై న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. 16 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. నట శిక్షకులు, నాటక దర్శకులు జల్లుకుమార్ (చైన్నె)చే 5 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారిచే 16వ తేదీన నాటక ప్రదర్శన ఉంటుందని తెలిపారు.