కాంగ్రెస్‌ నేత హత్యోదంతంలో నలుగురిపై కేసు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేత హత్యోదంతంలో నలుగురిపై కేసు

Published Tue, Apr 29 2025 9:25 AM | Last Updated on Wed, Apr 30 2025 2:04 AM

కాంగ్రెస్‌ నేత హత్యోదంతంలో నలుగురిపై కేసు

కాంగ్రెస్‌ నేత హత్యోదంతంలో నలుగురిపై కేసు

ఆలూరు/ఆలూరు రూరల్‌/చిప్పగిరి: కాంగ్రెస్‌ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మినారాయణ హత్యోదంతంపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్‌ రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం చిప్పగిరి–గంతకల్లు మధ్య దుండగులు లక్ష్మినారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును లారీతో గుద్ది వేటకొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వినోద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైకుంఠం శివప్రసాద్‌, వైకుంఠం మల్లికార్జున, మల్లేష్‌, కొండ రామాంజితో పాటు మరికొందరిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. 2006లో టీడీపీ నేత, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ వైకుంఠం శ్రీరాములు దంపతుల హత్యకేసులో లక్ష్మినారాయణ 7వ ముద్దాయి కాగా.. ఈ కేసును 2019లో కోర్టు కొట్టివేసింది. ఇదిలాఉంటే కర్నూలు–అనంతపురం జిల్లాలో సరిహద్దులో జరిగిన లక్ష్మినారాయణ హత్య కేసును అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా.. కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. లక్ష్మినారాయణ మృతదేహానికి సోమవారం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని భారీ పోలీసు బందోబస్తు నడుమ స్వగ్రామమైన చిప్పగిరికి తరలించారు.

ఉద్దేశపూర్వకంగానే

పికెట్‌ తొలగింపు: మారెప్ప

లక్ష్మినారాయణ హత్యోదంతంపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి మూలింటి మారెప్ప డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన చిప్పగిరిలో లక్ష్మినారాయణ భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పది నెలల్లో కుల రాజకీయాలకు వత్తాసు పలుకుతూ హత్యా రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే లక్ష్మినారాయణ ఇంటి వద్ద పికెట్‌ను తీసివేశారన్నారు. పికెట్‌ కొనసాగించాలని హోంమంత్రి అనితకు స్వయంగా తాను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు తదితరులు ఉన్నారు.

భారీ బందోబస్తు మధ్య లక్ష్మినారాయణ అంత్యక్రియలు

లక్ష్మీనారాయణ అంత్యక్రియలు పూర్తి

చిప్పగిరి: గుంతకల్లు – చిప్పగిరి మధ్య ఆదివారం హత్యకు గురైన కాంగ్రెస్‌ పార్టీ ఆలూరు నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ లక్ష్మీనారాయణ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిప్పగిరిలో సోమవారం పూర్తయ్యాయి. మృతదేహానికి ఎమ్మెల్యే విరుపాక్షి నివాళులు అర్పించగా.. పీసీ అధ్యక్షురాలు షర్మిళ ఫోన్‌లో కుటుంబ సభ్యలును పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ ఉసేన్‌ పీరా ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, పలువురు ఎస్‌ఐలతో గట్టి బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ గ్రామాన్ని, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. కాగా నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు, ఎమ్మార్పీఎస్‌ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement