మహబూబాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు మేడారాన్ని ముంచెత్తింది. జంపన్నవాగు రెండు వంతెనల పైనుంచి సుమారు 10 అడుగుల ఎత్తున వరద ప్రవహిస్తోంది. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ ఐలాండ్ ప్రాంత్రం, గ్రామంలోని బొడ్రాయి సమీపానికి వరద రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి.
గద్దెలను చుట్టిన వరద
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ వరద చేరింది. జంపన్నవాగు ప్రవాహం వరద అమ్మవార్ల గద్దె చుట్టూ చేరడం ఇదే మొదటి సారి. ఎప్పుడు వర్షాకాలంలో ఐటీడీఏ కార్యాలయం వరకే వరద చేరేది. జంపన్నవాగు చిలకలగుట్ట దారి నుంచి ప్రవాహం భారీగా చేరడంతో వరద మరింత ముంచెత్తింది. రెండంతస్తుల భవనాలు సైతం నీట మునిగిపోవడం గమనార్హం.
మునిగిన ఊరట్టం.. గుట్టపైకి చేరిన జనం
భారీ వరదకు ఊరట్టం నీట మునిగిపోయింది. జంపన్నవాగు, తూముల వాగు వరద గ్రామంలోకి చేరడంతో డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు మొత్తం మునిగింది. బాలికల ఆశ్రమ పాఠశాలలో భవనం మొదటి అంతస్తు వరకు వరద చేరడంతో విద్యార్థులు భ యాందోళనకు గురయ్యారు. ప్రజలంతా కట్టుబట్టలతో ఇళ్లను వదిలి సమీప గుట్టపైకి చేరుకున్నారు.
జలదిగ్బంధంలో గ్రామాలు..
మండలంలోని నార్లాపూర్, పడిగాపూర్, ఎల్బాక, వెంగళాపూర్, కాల్వపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంగళాపూర్‌లో ఇళ్లు నీట మునిగాయి. నార్లాపూర్‌లో బొడ్రాయి వరకు వరద కమ్మేసింది. కాల్వపల్లిలోని 40 ఇళ్లలోకి వరద చేరింది. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితి గ్రామాల్లో చూడలేదని వెంగళాపూర్, నార్లాపూర్ ప్రజలు తెలిపారు.
వ్యాపారులకు భారీ నష్టం
జంపన్నవాగు వరద మేడారంలోకి చేరడంతో చిరు వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. గతంలో హరిత హోటల్ నీడ చెట్టుకు వరకు మాత్రమే జంపన్నవాగు వరద వచ్చేది. బుధవారం అర్ధరాత్రి వరకే వరద ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం వరకు చేరడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. షాపుల్లోకి వరద చేరడంతో నీటిలో నుంచి సామగ్రి, సరుకులను బయటకు తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
16 మందిని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
మేడారాన్ని వరద ముంచెత్తడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాస్ ఆలం ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాడ్వాయి ఎస్సై ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, స్పెషల్ పార్టీ బృందం బోట్లతో జంపన్నవాగు వద్ద వరదలో ఓ ఇంటిపై చిక్కుకున్న వారిని, మేడారానికి వచ్చిన భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ బృందాలు మొత్తంగా వరదల్లో చిక్కుకున్న 16 మందిని కాపాడారు. కాగా, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి పరిస్థితిని పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment