jampanna vagu
-
టైరును తెప్పలా చేసి.. గర్భిణిని వాగు దాటించి..
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగా రం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద ఏటా వర్షాకాలంలో జంపన్నవాగు ప్రవాహంతో బానాజీబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతు న్నాయి. ఎలిశెట్టిపల్లికి చెందిన దబ్బకట్ల సునీత ఏడు నెలల గర్భిణి. ఆమెకు శుక్రవారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడే ఉన్న కొందరు గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో ట్రాక్టర్ వెనుక టైరును తెప్పలా మార్చారు. దానిపై గర్భిణిని కూర్చోబెట్టి వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి సాధారణమైన నొప్పులేనని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వాగుపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తాత్కాలిక బోటు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గద్దెలను తాకిన మేడారం జంపన్నవాగు..
మహబూబాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు మేడారాన్ని ముంచెత్తింది. జంపన్నవాగు రెండు వంతెనల పైనుంచి సుమారు 10 అడుగుల ఎత్తున వరద ప్రవహిస్తోంది. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ ఐలాండ్ ప్రాంత్రం, గ్రామంలోని బొడ్రాయి సమీపానికి వరద రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. గద్దెలను చుట్టిన వరద మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ వరద చేరింది. జంపన్నవాగు ప్రవాహం వరద అమ్మవార్ల గద్దె చుట్టూ చేరడం ఇదే మొదటి సారి. ఎప్పుడు వర్షాకాలంలో ఐటీడీఏ కార్యాలయం వరకే వరద చేరేది. జంపన్నవాగు చిలకలగుట్ట దారి నుంచి ప్రవాహం భారీగా చేరడంతో వరద మరింత ముంచెత్తింది. రెండంతస్తుల భవనాలు సైతం నీట మునిగిపోవడం గమనార్హం. మునిగిన ఊరట్టం.. గుట్టపైకి చేరిన జనం భారీ వరదకు ఊరట్టం నీట మునిగిపోయింది. జంపన్నవాగు, తూముల వాగు వరద గ్రామంలోకి చేరడంతో డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు మొత్తం మునిగింది. బాలికల ఆశ్రమ పాఠశాలలో భవనం మొదటి అంతస్తు వరకు వరద చేరడంతో విద్యార్థులు భ యాందోళనకు గురయ్యారు. ప్రజలంతా కట్టుబట్టలతో ఇళ్లను వదిలి సమీప గుట్టపైకి చేరుకున్నారు. జలదిగ్బంధంలో గ్రామాలు.. మండలంలోని నార్లాపూర్, పడిగాపూర్, ఎల్బాక, వెంగళాపూర్, కాల్వపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంగళాపూర్‌లో ఇళ్లు నీట మునిగాయి. నార్లాపూర్‌లో బొడ్రాయి వరకు వరద కమ్మేసింది. కాల్వపల్లిలోని 40 ఇళ్లలోకి వరద చేరింది. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితి గ్రామాల్లో చూడలేదని వెంగళాపూర్, నార్లాపూర్ ప్రజలు తెలిపారు. వ్యాపారులకు భారీ నష్టం జంపన్నవాగు వరద మేడారంలోకి చేరడంతో చిరు వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. గతంలో హరిత హోటల్ నీడ చెట్టుకు వరకు మాత్రమే జంపన్నవాగు వరద వచ్చేది. బుధవారం అర్ధరాత్రి వరకే వరద ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం వరకు చేరడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. షాపుల్లోకి వరద చేరడంతో నీటిలో నుంచి సామగ్రి, సరుకులను బయటకు తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. 16 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మేడారాన్ని వరద ముంచెత్తడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాస్ ఆలం ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాడ్వాయి ఎస్సై ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్పెషల్ పార్టీ బృందం బోట్లతో జంపన్నవాగు వద్ద వరదలో ఓ ఇంటిపై చిక్కుకున్న వారిని, మేడారానికి వచ్చిన భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ బృందాలు మొత్తంగా వరదల్లో చిక్కుకున్న 16 మందిని కాపాడారు. కాగా, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పరిస్థితిని పర్యవేక్షించారు. -
జల దిగ్బంధంలో మేడారం
-
జల దిగ్బంధంలో మేడారం
సాక్షి, ములుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా పొంగిపొర్లుతుంది. వర్షపు నీరు మేడారం గ్రామాన్ని పూర్తిగా చుట్టేశాయి. ఓ గ్రామాన్ని వర్షపు నీరు పూర్తిగా ఇలా గ్రామాన్ని చుట్టేయడం చరిత్రలో మొదటిసారి. ప్రస్తుతం జంపన్న వాగు నీరు మేడారం గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయానికి తాకాయి. ఇప్పటికే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో పోలీసులు పస్రా నుంచి మేడారానికి రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశారు. ఊరట్టం వద్ద భారీగా జంపన్న వాగు భారీగా ప్రవహిస్తోంది. మేడారం గ్రామం బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్తూ గ్రామంలోకి వరద నీరు చేరుతోంది. వరద ఉధృతితో మేడారం అమ్మవార్ల గద్దెలను జంపన్న వాగు నీరు తాకనుంది. వర్షపు నీరు ఇప్పటికే చిలుకల గుట్టను తాకి మేడారం గద్దెల వైపు భారీగా ప్రవహిస్తోంది. -
మేడారం జాతరలో అపశ్రుతి
సాక్షి, వరంగల్ : మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. జంపన్నవాగులో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు సికింద్రాబాద్‌కు చెందిన వినయ్, దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్‌గా గుర్తించారు. వీరిద్దరు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్ల దర్శనానికి వచ్చి స్నానాలు చేసేందుకు జంపన్నవాగులో దిగారు. ఈ క్రమంలో వారికి మూర్ఛ వచ్చి వాగులో పడి మృతిచెందారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారం బాటపట్టారు. పెద్ద మొత్తంలో వాహనాలు బారులు తీరడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం కసరత్తు ప్రారంభించారు. -
జంపన్నవాగులో భక్తుడి గల్లంతు
మేడారం: వరంగల్ జిల్లా జంపన్న వాగులో పుణ్య స్నానానికి దిగిన భక్తుడు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. వరంగల్ కు చెందిన శ్రీధర్‌కుమార్(28) ఆదివారం స్నేహితులతో కలిసి అమ్మవారి గద్దెలను దర్శించుకోవడానికి వచ్చాడు. ఈ క్రమంలో జంపన్న వాగులో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. ఇది గమనించిన అతని స్నేహితులు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సోమవారం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
చురుగ్గా జంపన్నవాగు రెండో బ్రిడ్జి పనులు
మేడారం(గోవిందరావుపేట), న్యూస్‌లైన్ : మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జంపన్నవాగుపై చేపట్టిన రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సుమారు *3కోట్ల వ్యయంతో గత డిసెంబర్ 9న ఆర్అండ్బీ అధికారులు పనులను ప్రారంభించారు. అయితే తొలుత జంపన్నవాగు నుంచి వస్తున్న నీటితో నిర్మాణ పనుల్లో జాప్యం నెలకొంది. ఈ సందర్భంగా కూలీ లు జంపన్నవాగుకు వస్తున్న వరద నీటిని వేరే వైపునకు మళ్లించేందుకు బ్రిడ్జి పక్క నుంచి కాలువను తీసి సగభాగం వరకు బెడ్ నిర్మాణం చేపట్టారు. దీంతో పూర్తయిన పిల్లర్లపై మొదటిస్లాబు పోసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే స్లాబ్ పనులు 15వ తేదీ నుంచి 31వ తేదీలోగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో బ్రిడ్జి పనులు సకాలంలో పూర్తయితే జాతరలో ట్రాఫిక్ అంతరాయం తగ్గడంతోపాటు, భక్తు లు బ్రిడ్జిపై నడిచేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. 31లోగా పూర్తి చేసేందుకు చర్యలు.. జంపన్నవాగుపై చేపట్టిన రెండో బ్రిడ్జి నిర్మాణ పనులను ఈనెల 31వ తేదీలోగా నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్ఎండ్బీ డీఈ వెంకటేశ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. జంపన్నవాగు నీటి ప్రవాహం కారణంగా మొదట్లో పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. బ్రిడ్జిపై మూడు స్లాబులు పూర్తి కాగానే నీటి ప్రవాహాన్ని వేరేవైపు మరల్చి రెండో వైపు కూడా పనులను పూర్తి చేస్తామని తెలిపారు. మొత్తంగా జాతరలోగా భక్తులకు బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు.