మహబూబాబాద్: పాపం.. పసికందు.. ఆడపిల్ల భారమనుకున్నారో..? లేదా నెలలు నిండకముందే జన్మంచిందనకున్నారో..? లేదా ఇతర కారణాల వల్లనో గాని శిశువును వదిలించుకున్నారు. తల్లి గర్భంలో ఎన్నో గండాలు.. మరెన్నో సుడిగుండాలు తట్టుకుని జీవం పోసుకున్న ఆ శిశువు.. ఆరు నెలల అనంతరం బహ్య ప్రపంచంలోకి అడుగిడింది. అయితే అమ్మ ఒడిలో హాయిగా సేదదీరాల్సిన ఆ శిశువు పొదల్లో దర్శనమిచ్చింది.
దిక్కులు పిక్కటిల్లేలా గుక్కపెట్టి ఏడుస్తోంది. ఈ శబ్దం విన్న గ్రామస్తులు అక్కడి వెళ్లి చూడగా ఆ పసిమొగ్గ దీనస్థితిలో కనిపించింది. ఈ హృదయవిదారక ఘటనను చూసి వారు చలించిపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని శిశువును ఆస్పత్రికి తరలించారు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం మండలంలోని పాత్రాపురం శివారులోని పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం ఆడ శిశువును పడేసి వెళ్లారు.
ఈ శిశువును చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకుని శిశువును వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ శిశువు తల్లిదండ్రుల వివరాలు ఎవరికై నా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై అశోక్ పేర్కొన్నారు. కాగా, శిశువు పూర్తి నెలలు నిండకుండానే 7 నెలలో జన్మించిందని, పాపను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తున్నట్లు వైద్యాధికారి విజిస్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment