‘సూపర్‌’.. సేవలు వెరీ పూర్‌! | - | Sakshi
Sakshi News home page

‘సూపర్‌’.. సేవలు వెరీ పూర్‌!

Published Sat, Feb 22 2025 1:40 AM | Last Updated on Sat, Feb 22 2025 1:36 AM

‘సూపర

‘సూపర్‌’.. సేవలు వెరీ పూర్‌!

ఎంజీఎం : వరంగల్‌ మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో పాలన, పర్యవేక్షణ అధ్వానంగా మారింది. ఎవరు.. ఎప్పడు విధులకు వస్తారో.. డుమ్మా కొడుతారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సూపర్‌ ఆస్పత్రి పాలనపై ఎంజీఎం పరిపాలనాధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో ఇక్కడి వైద్యులు, సిబ్బంది చుట్టపు చూపుగా విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపర్‌ ఆస్పత్రిలో పోస్టింగ్‌ కేటాయిస్తే పారామెడికల్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఎగిరి గంతులు వేస్తున్నారు. నాలుగైదు గంటల్లో విధులు ముగియడం, అడిగేవారు ఉండకపోవడే ఇందుకు కారణం.

ఆస్పత్రిలో మాజీ మంత్రులు,

ఎమ్మెల్యే అనుచరుల నియామకం..

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో గత ప్రభుత్వ హయాంలో మూడు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా తాజా, మాజీ ప్రజాప్రతినిధుల అనుచరులను ఆయా విభాగాల్లో నియమించారు. ఆస్పత్రి మొత్తంగా పారామెడికల్‌ సిబ్బంది 110మంది ఉంటారు. కాగా, తాజా, మాజీ ప్రజాప్రతినిధుల హయాంలో ఒక్కో ఏజెన్సీలో 27మందిని తీసుకున్నారు. సదరు పారామెడికల్‌ సిబ్బంది నియామకం చేపట్టినప్పటినుంచి నినిమిది గంటల విధులకు బదులు నాలుగు గంటలు నిర్వర్తిస్తూ ఇదేమని ప్రశ్నిస్తే అధికారులపై ‘రాజకీయ’ ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవా నికి వారి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను పరిశీలిస్తే వారు ఎన్ని గంటలు విధులు చేస్తున్నారో బయట పడుతుందని కొందరు చెబుతున్నారు.

మూడు గంటల వైద్యుల విధులు..

సూపర్‌ ఆస్పత్రికి వచ్చే వైద్యుల విధులు చుట్టుపు చూపులాగానే ఉన్నాయి. ఓపీ ఉన్న రోజుల్లో 9 నుంచి 12 గంటల వరకు విధులు నిర్వర్తించాలి. ఓపీ కూడా పలు విభాగాలకు వారానికి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ రోజుల్లో సైతం సమయానికి రాకుండా 9.30 గంటల తరువాత హాజరువుతూ 12 దాటక ముందే వారివారి క్లినిక్‌లకు పరుగులు పెడుతున్నట్లు రోగులు వాపోతున్నారు. ఇదంతా ఆస్పత్రి ఆర్‌ఎంఓలకు తెలిసినా ‘వైద్యుల్ని ప్రశ్నించేస్థాయి మాది కాదు. సూపరింటెండెంట్‌, డీఎంఈ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని దాటవేస్తున్నారు.

ప్రత్యేక దృష్టి సారిస్తాం..

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ను నియమించాం. పారామెడికల్‌ సిబ్బంది, వైద్యుల విధులపై విభాగాధిపతులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. బయోమెట్రిక్‌ను పరిశీలిస్తాం. రోగులకు మెరుగైన సేవలందిస్తాం.

– డాక్టర్‌ కిశోర్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో

మూడు గంటలే వైద్యుల విధులు

పారామెడికల్‌ సిబ్బంది అయితే

8 గంటలకు బదులు 4 గంటలే..

తాజా, మాజీ ప్రజాప్రతినిధుల

అనుచరుల నియామకం

ఇదేంటని ప్రశ్నిస్తే..

అధికారులపై ‘రాజకీయ’ ఒత్తిళ్లు

పై ఫొటో చూడండి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఓపీ దగ్గరి పరిస్థితి. శుక్రవారం ఈ విభాగం ఓపీ సేవలను అందిస్తారు. ఉదయం 9 గంటల సమయానికి 100 మంది రోగులు ఓపీ స్లిప్‌లు తీసుకుని కూర్చున్నారు. 9 గంటలకు రావాల్సిన వైద్యులు 9.25గంటలు దాటినా రాలేదు. 12 గంటలు కొట్టగానే ఠంచనుగా ఓపీ సేవలను మూసివేస్తారు. మూడు గంటలపాటు చూడాల్సిన ఓపీని.. 2 గంటల నుంచి 2.30 గంటల వరకు చూస్తే.. వచ్చిన వందమంది రోగులను ఎలా పరీక్షిస్తారన్నది వైద్యులకే తెలియాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
‘సూపర్‌’.. సేవలు వెరీ పూర్‌!1
1/1

‘సూపర్‌’.. సేవలు వెరీ పూర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement