అనంతాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వరస్వామి ఆలయ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో శ్రీవిశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షా బంధనం, మృత్సంగ్రహణం, ఋత్విక్ కరణం, అంకురారోహణం, వైనతేయ ఆదివాస హోమం, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి పూజలు నిర్వహించారు. నాయిని ప్రభాకర్ రెడ్డి, కాళీనాథ్, శ్రీనివాస్ అచార్యులు, అనిరుద్ధ ఆచార్యులు, విశ్వం తదితరులు పాల్గొన్నారు.
నేడు విశ్వక్సేన యజ్ఞం...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని నిర్వాహకులు తెలిపారు. సేవా కాలం, వేద విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి అనంతరం ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, మూర్తి కుంభారాధన, మూలమంత్ర హవనం పూజలు జరుగుతాయన్నారు. శ్రీవిశ్వక్సేన యజ్ఞం నిర్వహించి ధ్వజారోహణం ద్వారా గరుడ ప్రసాదం భక్తులకు అందజేస్తారని, సంతానార్థులు ఆలయానికి వచ్చి గరుడ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాలని వారు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని, ద్వారా తోరణ, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, నిత్యాహవనం, నిత్య పూర్ణాహుతి, దేవతాహ్వానం, నివేదన, బలిహరణ, వేద విన్నపం, తీర్థప్రసాదం పంపిణీ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment