● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్: మహిళలు, చిన్నారులు వేధింపుల నుంచి రక్షణ పొందేలా పోలీసులు, భరోసా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ ఎస్పీ శనివారం సందర్శించి భరోసా సేవలను సమీక్షించారు. ఎస్పీ చొరవతో 2022 నుంచి 2024 వరకు భరోసా కేంద్రం ద్వారా 56 మంది బాధితులకు ప్రభుత్వం తరఫున రూ.20.75 లక్షలు బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాయిదా పడకుండా వెంటనే విడుదల చేయించబడగా బాధితులకు పరిహారం అందేవిధంగా కృషి చేసిన డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సరవయ్యను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల ఖాతాల్లోకి పరిహారం వేగంగా జమ చేయడానికి భరోసా యంత్రాంగం మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. బాధితులకు ఇచ్చే మానసిక, లీగల్ కౌన్సెలింగ్ మరింత బలోపేతంచేసి, వారికి తగిన సహాయం అందించాలన్నారు. భరోసా కేంద్రం మహిళలు, చిన్నారుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన సహాయం పొందేందుకు ప్రజలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భరోసా టీం సభ్యులు జ్యోత్స్న, జయశ్రీ, పార్వతి, రేణుక, మౌనిక, ఎస్బీ సీఐ చంద్రమౌళి, రూరల్ సీఐ సర్వయ్య, రూరల్ ఎస్సై దీపిక, షీ టీం ఎస్సై సునంద, సిబ్బంది పాల్గొన్నారు.
శాస్త్రవేత్తగా ఒకరోజు
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను హైస్కూల్ స్థాయిలో వెలికితీసేందుకు, పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు విద్యార్థులకు శాస్త్రవేత్తగా ఒకరోజు వినూత్న కార్యక్రమానికి ఎన్సీఈఆర్టీ హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ శిక్షణ నిర్వహిస్తుందని డీఈఓ ఏ.రవీందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏప్రిల్ 5వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి అప్పారావు (9849598281)ను సంప్రదించాలన్నారు.