
కంఠాయపాలెంలో విషాదచాయలు
తొర్రూరు రూరల్: సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెం గ్రామ శివారులో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన భార్య, భర్తలతోపాటు కూతురు మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. కంఠాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్ హైదరాబాద్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ భార్య, కూతురు, కుమారుడిని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో తన అత్తగారి స్వగ్రామమైన ఆత్మకూరు మండలంలోని కోటపహాడ్ గ్రామంలో జరిగిన ఓ పండుగకు హాజరై కుటుంబ సభ్యులతో తిరిగి హైదారాబాద్‌కు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో బీబీగూడెం శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారు డ్రైవర్‌గా ఉన్న గడ్డం రవీందర్(34), భార్య గడ్డం రేణుక( 28), కుమారై రిషిత(8)కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరికొంతమందికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. సమాచారం తెలిసిన కంఠాయపాలెం గ్రామంలోని మృతుడు రవీందర్ తల్లి గడ్డం లక్ష్మితోపాటు బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
భార్యా, భర్త, కూతురు మృతి
స్వగ్రామంలో మిన్నంటిన రోదనలు