వరంగల్ రంగస్థలం..
కాకతీయుల కాలంలో ఎన్నో రకాల కళారూపాలు ప్రదర్శించేవారని క్రీడాభిరామం, నృత్యరత్నావళి, బసవపురాణం తదితర గ్రంథాల్లో పేర్కొనబడింది. చిందుల వారు, జక్కులవారు, తెరచీరల వారు, పేరిణి, ప్రేంకిణి వంటి ఎన్నో కళారూపాలు ప్రదర్శించేవారని తెలుస్తోంది. వాటిలో చాలా కళారూపాలు ఇప్పటికీ జానపదాల రూపంలో వ్యాప్తిలో ఉన్నాయి. ఆధునిక కాలంలో పౌరాణిక పద్యనాటకాలు రూపొందడానికి చరిత్ర ఉంది. 1940కి పూర్వమే మడికొండ, మొదలైన చోట్ల పద్యనాటక సమాజాలు ఏర్పడ్డాయి. 1943లో పాములపర్తి సదాశివరావు కాకతీయ కళాసమితి స్థాపించి భక్తరామదాసు నాటకం ప్రదర్శించారు. 1965లో శ్రీరాజరాజేశ్వరీ నాట్య మండలి, హిందూ డ్రమెటిక్ అసోసియేషన్ స్థాపించారు. ఆ తర్వాత ఓరుగల్లులో పద్యనాటకాల స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆజంజాహి మిల్స్ ఆర్ట్స్ అసోసియేషన్, మంజు ఆర్ట్స్ అసోసియేషన్, మారుతి నాట్యమండలి, శ్రీశారదా నాట్యమండలి తదితర అనేక సంస్థలు ప్రారంభమయ్యాయి. ఆజంజాహి మిల్లులో పనిచేసిన జమ్మలమడక కృష్ణమూర్తి శ్రీశారదానాట్య మండలిని ఏర్పాటు చేసి పద్యనాటకాలు ప్రదర్శించారు. వేమూరి శ్రీనివాసమూర్తి హార్మోనియం సహకారం అందించేవారు. మారేడోజు సదానందాచారి పౌరాణిక పాత్రలు పోషించేవారు. పందిళ్ల శేఖర్‌బాబు తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ స్థాపించి వరంగల్ పద్యనాటకానికి రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులు వచ్చేలా కృషిచేశారు. మరోవైపు రేకందార్ నాగేశ్వరరావు స్థాపించిన సురభి భానోదయ నాట్యమండలి ఓరుగల్లు పద్యనాటకానికి రంగాలంకరణ సౌరభాలు అందించింది.
నాటక రంగంలో ఓరుగల్లు కళాకారులు ప్రతిభ..
భారతీయ సంప్రదాయ నృత్యాలు, నాటక కళలకు ఓరుగల్లు పుట్టిల్లు. ఈ నేపథ్యంలో మన కళాకారులు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తూ పలువురు ప్రముఖులతో అవార్డులు, మన్ననలు పొందుతున్నారు. నిత్యం సాధన చేస్తూ పోటీల్లో ప్రతిభ చాటుతున్నారు. ఏదో ఒక పనిచేస్తూనే ఖాళీ సమయంలో వేదికలపై తమ నాటకాలు ప్రదర్శిస్తూ కళారత్నాలుగా విశేష గుర్తింపు తెచ్చుకుంటూ ప్రశంసలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన కళాకారులకు నటక రంగంపై గల ఆసక్తి, సాధించిన విజయాలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.
నాటక రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకుంటున్న కళాకారులు
పాత్ర ఏదైనా సులభంగా పోషిస్తున్న మహానటులు
నేడు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం
నాటకం.. సమాజంలో జరిగే యథార్థ ఘటనలకు ప్రతిరూపం. అది మంచి కావొచ్చు లేదా చెడు కావొచ్చు. కళాకారులు ఆయా ఘటనలకు సంబంధించిన పాత్రలు ధరించి ప్రజలను ఆలోజింపచేస్తారు. చైతన్య పరుస్తారు. అందుకే భారతీయ సమాజంలో నాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రీ.పూ నాలుగో శతాబ్దంలోనే భరతముని రచించిన నాట్యశాస్త్రం భారతీయ నాటకానికి ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. ప్రాచీనకాలంలో మహాకవి కాళీదాసు, భవభూతి రచించిన నాటకాలు ప్రసిద్ధి చెందాయి. మార్చి 27 అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ఈ నేపథ్యంలో ఓరుగల్లు కళాకారులకు నాటక రంగంపై గల ఆసక్తి.. వారు సాధించిన విజయాలు.. ఇతర వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సమాజానికి మంచి సందేశం..
నాటక రంగంలో పదేళ్ల అనుభవం ఉన్న నటుడు మాలి విజయరాజ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. మార్గదర్శి, అన్నదాత, ఏ నిమిషానికి ఏమీ జరుగునో, కనువిప్పు, వైద్యో నారాయణో హరీ, పరివర్తన, ఇదెక్కడి న్యాయం, ధనకాంక్ష తదితర నాటకాలు ప్రదర్శించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేది నాటక రంగమని పేర్కొంటున్నారు మాలి విజయరాజ్.
– మాలి విజయరాజ్, నటుడు, దర్శకుడు
●
ఓరుగల్లు కళారత్నాలు..