
వరి పంట ఎండిందనే మనస్తాపంతో ..
బచ్చన్నపేట : ఒక పక్క కూతురు పెళ్లికి చేసిన అప్పు.. మరో పక్క భూగర్భజలాలు అడుగంటి బోరు నుంచి సరిగా నీరు రాకపోవడంతో ఎండిన ఎకరం వరి పంట.. ఈ కారణాలతో మనోవేదనకు గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎస్‌కే హమీద్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒగ్గు మహేశ్ (42) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం అప్పు చేసి కూతురు వివాహం చేశాడు. ఇటీవల తనకున్న ఒక ఎకరం భూమిలో వరి పంట సాగు చేశాడు. అయితే భూగర్భ జలాలు అడుగంటి బోరు సరిగా నీరు పోయకపోవడంతో ఆ పంట ఎండిపోయింది. దీంతో కూతురు పెళ్లికి చేసిన అప్పు ఎలా తీర్చాలని, వరి పంట కూడా ఎండిపోయిందని మనోవేదనకు గురైన మహేశ్ గత నెల 29వ తేదీన తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హమీద్ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
● ఆత్మహత్యకు యత్నించిన రైతు
● చికిత్స పొందుతూ మృతి
● రామచంద్రాపురంలో ఘటన