
అకాల వర్షం.. రైతుకు నష్టం
బయ్యారం: అకాలవర్షం, వరద మొక్కజొన్న రైతులను నిలువునా ముంచింది. గురువారం రాత్రి కురిసిన వర్షం రైతులను అతలాకుతలం చేసింది. మండలంలోని వెంకట్రాంపురం పంచాయతీ పరిధిలోని సంగ్యాతండా గ్రామానికి చెందిన రైతులు యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. సుమారు 50ఎకరాల్లో సాగు చేసిన పంటను మిల్లు పట్టించిన తర్వాత జొన్నలను ఆరబెట్టేందుకు రైతులు రోడ్డుపక్కన ఉన్న మడికట్టులో కుప్పలుగా పోశారు.
వర్షం వస్తుందని జాగ్రత్త పడ్డప్పటికీ..
వర్షం సూచన ఉండటంతో ముందస్తుగా అప్రమత్తమైన రైతులు తమ మొక్కజొన్న రాశులపై పట్టాలను కప్పి జాగ్రత్తలు పడ్డారు. రెండు విడతలుగా భారీ వర్షం కురవడంతో జొన్నల రాశులు ఉన్న ప్రాంతంలోకి ఎగువ నుంచి భారీ వరద వచ్చి రాశులను ముంచేసింది. అప్పటికే అప్రమత్తమైన రైతులు వరదనీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తిస్థాయిలో నీరు వెళ్లక మొక్కజొన్న రాశులు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. కాగా సంగ్యాతండాతో పాటు బయ్యారంలో వర్షానికి దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయాధికారి రాంజీ శుక్రవారం పరిశీలించారు. జరిగిన నష్టం వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు.
నేలమట్టమైన వరిపంట
గార్ల: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షంతో వరిపంటలు నేలమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని అంకన్నగూడెం గ్రామానికి చెందిన రైతు కల్తీ శ్రీను మూడు ఎకరాల వరిపంట నేలమట్టమైంది. వరిపంట దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా నాయకుడు కందునూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆగమాగం
చిన్నగూడూరు: మండల వ్యాప్తంగా గురువారం రాత్రి అకాల వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతన్నలు ఆగమాగమయ్యారు. కల్లాల్లో ఆరబెట్టిన పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిర్చి పంట తడవకుండా టార్పాలిన్లు కప్పారు.
నీళ్లలో మునిగిన మొక్కజొన్నలతో
రైతులకు తీవ్రనష్టం

అకాల వర్షం.. రైతుకు నష్టం

అకాల వర్షం.. రైతుకు నష్టం

అకాల వర్షం.. రైతుకు నష్టం