
మిర్చి రైతులకు మెరుగైన ధర ఇవ్వాలి
● జేడీఎం ఉప్పుల శ్రీనివాస్
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు నాణ్యత ప్రకారం మెరుగైన ధరల్ని ఇచ్చేందుకు వ్యాపారులు కృషి చేయాలని వరంగల్ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మిర్చి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మిర్చి ధరలపై సుధీర్ఘంగా చర్చించారు. తేజ రకం మిర్చిని జిల్లాలోని రైతులు ఖమ్మం మార్కెట్‌కు తరలించడంపై అధికారులు స్పందించి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా తేజ రకం మిర్చి ధరలు వరంగల్, ఖమ్మం మార్కెట్‌లో వ్యత్యాసం ఎక్కువగా ఉందని, రైతుల నుంచి వచ్చిన ఆరోపణలను వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి నంబర్–1 క్వాలిటీ వెళ్తుందని, ఇక్కడికి 2, 3 రకం వస్తున్నందున ఈపరిస్థితులున్నట్లు వ్యాపారులు చెప్పారు. ఖమ్మం మార్కెట్ నుంచి తెచ్చిన షాంపిళ్లను వారి ముందు పెట్టి వరంగల్‌కు వచ్చిన మిర్చి ఒకేలా ఉన్నా ఎందుకు ధరల్లో వత్యాసం ఉందని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి వ్యాపారులు ఘాటు తక్కువ ఉందని, కలర్ తక్కువ ఉందని వివిధ కారణాలు చెప్పినా.. అధికారులు సంతృప్తి చెందలేదని తెలిసింది. వరంగల్ మార్కెట్‌కు వచ్చే మిర్చికి నాణ్యతా ప్రమాణాల ప్రకారం.. మెరుగైన ధరలు చెల్లించేలా చాంబర్ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జేడీఎం సూచించారు. సోమవారం నుంచి ఈసమస్యను పరిష్కరించేందుకు సహకారం అందిస్తామని వ్యాపారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. సమావేశంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జి.రెడ్డి, చాంబర్ ప్రతినిధులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, వేద ప్రకాశ్, రాజు కరాణి తదితరులు పాల్గొన్నారు.