కుల దూషణ కేసులో ఒకరికి జైలు | - | Sakshi
Sakshi News home page

కుల దూషణ కేసులో ఒకరికి జైలు

Published Sat, Apr 26 2025 1:37 AM | Last Updated on Sat, Apr 26 2025 1:39 AM

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌ మాజీ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ లకావత్‌ ధన్వంతిని బెదిరించి కులం పేరుతో దూషించిన నేరంలో నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామానికి చెందిన నేరస్తుడు యం.మోహన్‌రెడ్డి, ఆరు నెలల జైలు శిక్ష మూడు వేల జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి మనీష శ్రావణ్‌ ఉన్నమ్‌ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. 2010 మార్చి 29న అప్పటి జెడ్పీ చైర్‌పర్సన్‌ అయిన లకావత్‌ ధన్వంతి తన అధికార బాధ్యతల నిర్వహణలో భాగంగా కార్యాలయంలో ఉన్న సమయంలో నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ధన్వంతి వద్దకు వచ్చి తనను తాను కాంగ్రెస్‌ పార్టీ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిగా పరిచయం చేసుకున్నాడు. అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చాడు. పరిశీలించిన చైర్‌పర్సన్‌ ప్రస్తుతం నిధులు లేవు మరోసారి చేస్తానని చెప్పగా.. గట్టిగా అరుస్తూ ‘నువ్వెంత? నువ్వు గెలిచావు.. నేను ఓడిపోయాను.. ఇద్దరం సమానమే నాకు నిధులు ఇవ్వాల్సిందే’ అని గట్టిగా అరుస్తూ టేబుల్‌పై కొట్టగా అది విన్న పోలీసులు, గన్‌మెన్‌, సిబ్బంది చైర్‌పర్సన్‌ గదిలోకి వచ్చారు. అందరి ఎదుటనే రిజర్వేషన్‌ వల్ల లంబాడీ కులం నుంచి వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టించారని బెదిరించాడు. కులం హోదాను అవమానిస్తూ దూషించాడు. దీనిపై చైర్‌పర్సన్‌ ధన్వంతి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్తుడు యం.మోహన్‌రెడ్డి, ఆర్నెళ్ల జైలు శిక్ష.. రూ.3 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. కేసును పీపీ సంతోశ్‌ వాదించగా సాక్ష్యులను కానిస్టేబుల్‌ చందర్‌ కోర్టులో ప్రవేశపెట్టారు.

రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులకు బెయిల్‌

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో పలువురు నిందితులకు భూపాలపల్లి జిల్లా ప్రధాన కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఫిబ్రవరి 19న జరిగిన హత్య కేసులో పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపగా.. ఇద్దరు వ్యక్తులకు గత నెలలో బెయిల్‌ వచ్చింది. కొత్త హరిబాబు, రేణుకుంట్ల కొమురయ్యకు మినహా మిగితా 8 మందికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. హరిబాబు, కొమురయ్య హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. హైకోర్టు నుంచి బెయిల్‌ రావాల్సి ఉంది.

దంపతుల అదృశ్యం.. కేసు నమోదు

కాజీపేట: దాదాపు 5 రోజులుగా భార్యాభర్తలు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హనుమకొండ జవహర్‌ నగర్‌ కాలనీకి చెందిన అయిత సందీప్‌, మానస ఈనెల 21న ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఇళ్లలో ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. గురువారం రాత్రి వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో బైక్‌ లభించడంతో సందీప్‌ తండ్రి సంపత్‌కుమార్‌ కాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ చేపట్టినట్లు వివరించారు.

కుల దూషణ కేసులో ఒకరికి జైలు1
1/1

కుల దూషణ కేసులో ఒకరికి జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement