ప్రియుడి ఇంటి వద్ద నిరసన తెలుపుతున్నయువతి, ప్రజా సంఘాల నాయకులు
మహబూబ్‌నగర్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ఇంటి ఎదుట దీక్షకు కూర్చింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలుకు చెందిన యువతి 2018 నుంచి మండలంలోని పాలెంకు చెందిన బురానుద్దీన్‌తో ప్రేమలో ఉన్నారు. 2020లో ఇరు కుటుంబాలు వివాహం కోసం నిశ్చితార్థం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తన చెల్లి పెళ్లి తర్వాత తన పెళ్లి చేసుకుందామని వాయిదా వేసిన బురాన్ నేటి వరకు ఆ యువతిని వివాహం చేసుకోకుండా మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న ప్రేమించిన యువతి ఆదివారం సాయంత్రం నుంచి ఇంటి వద్దనే కూర్చొని నిరసన తెలిపింది. సోమవారం ఐద్వా జిల్లా కార్యదర్శి గీత, డీవైఎప్‌ఐ జిల్లా కార్యదర్శి శివవర్మ, ఆవాజ్ సంఘం నాయకులు సలీం, బాబా, ప్రజా సంఘాల నాయకులు సోమనాథ్, కిరణ్, రామకృష్ణ, రాంచందర్, సునీత యువతికి మద్దతు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన బురాన్ ఆ యువతి నుంచి ఆర్థికంగా, శారీరకంగా వాడుకొని ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమైన అతనిపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ యువతి తన బ్యాగులో నుంచి విషం సీసా బయటికి తీసింది. వెంటనే అక్కడ ఉన్న నాయకులు ఆ సీసాను తీసుకుని పారవేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణదీక్ష చేస్తామని అన్నారు. ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి బాధితురాలికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment