మహబూబ్‌నగర్: మున్సిపాలిటీ పరిధిలోని మహాత్మాజోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల సమీపంలో బుధవారం అరుదైన పామును గుర్తించారు. నల్లటిరంగు కలిగి తెల్లటి పట్టీలతో కూడిన వెల్లూరు బ్రైడల్ పామును చూసిన స్థానికులు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డా.సదాశివయ్యకు సమాచారం అందించారు.
ఆయన బయోలజి ఉపాధ్యాయు డు దేవిలాల్‌కు చెప్పడంతో వెళ్లి పామును పట్టుకుని ఫొటోలను సదాశివయ్యకు పంపించారు. పట్టుకున్న పాము అరుదైనదిగా గుర్తించారు. విషరహిత పాము కావటం వల్ల దానివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలేయాలని సూచించటంతో దేవిలాల్ దానిని గుట్టపై ఉన్న అటవీప్రాంతంలో వదిలేశారు.
సదాశివయ్య మాట్లాడుతూ నల్లటిరంగులో తెల్లటి పట్టీలు కలిగి అందంగా కనిపించే పామును శాసీ్త్రయంగా డ్రయోకలామస్ నింఫా అని పిలువబడే కోలుబ్రీడే కుటుంబానికి చెందినదిగా వివరించారు. 50సెం.మీ. వరకు పాము పొడవు అవుతుందన్నారు. ఈ పామును మొట్టమొదట తమిళనాడులోని వెల్లూరు సమీపంలో 1803లో గుర్తించారని తెలిపారు. దీనిమెడపైన ఉన్న తెల్లని మచ్చ పెళ్లికూతురు మెడమీద ఉన్న ఓణిలా ఉండటం మూలాన వెల్లూర్ బ్రైడల్ స్నేక్ అని పిలుస్తారన్నారు.
కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో దీనిని గుర్తించినా ఇప్పటి వరకు పాముకు సంబంధించిన అనేక విషయాలు ప్రపంచానికి తెలియవన్నారు. ఎన్నిగుడ్లు పెడుతుంది, ఎన్ని రోజులకు పిల్లలుగా మారుతాయి, ప్రత్యుత్పత్తి వివరాలు తెలియవన్నారు. ఎలాంటి గోడలైనా సునాయాసంగా ఎక్కగలదని, ఎలుకలు, బల్లులు ప్రధాన ఆహారంగా తీసుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment