సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌లో ముందస్తుగానే అభ్యర్థిత్వాలు ఖరారు కాగా.. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21న జాబితా వెల్లడించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలో నిలవనున్నారు. వీరిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యమున్న అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఇంకా జల్లెడపడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో ఆయా పార్టీల్లో టికెట్ ఆశిస్తున్న పలు నియోజకవర్గాల నేతలు హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. అభ్యర్థిత్వాల ఖరారులో జరుగుతున్న జాప్యం వారిని ఉత్కంఠకు గురి చేస్తోంది. మరోవైపు ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురికి పైగా పోటీపడుతుండడం.. ఎవరికి వారు తామే అభ్యర్థులమని.. తమకే సీటు వస్తుందని ఆశావహులు ప్రచారం చేసుకుంటుండడంతో ఆయా పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
కాంగ్రెస్.. వారంలో జాబితా..
ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. జిల్లాల విభజన క్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గం పూర్తిగా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లింది. ఇది మినహాయించి 13 సెగ్మెంట్లలో (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్, వనపర్తి, గద్వాల, అలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్) 73 మంది ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో కొడంగల్ నుంచి ఒకే ఒక్కడు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, అలంపూర్ నుంచి ఇద్దరు కాగా.. మిగతా నియోజకవర్గాల్లో ముగ్గురి నుంచి పది మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాకుండా మారిన రాజకీయ పరిణామాల క్రమంలో టికెట్ ఆశించి ఒకరిద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరారు. అభ్యర్థుల ఆర్థిక స్థోమత, సామాజిక సేవలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, పలు సర్వేల ఆధారంగా ఢిల్లీ వేదికగా పార్టీ స్క్రీనింగ్ కమిటీ వడపోత పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
అయితే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఫైనల్ చేసిన తర్వాతే బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నట్లు సమాచారం. నారాయణపేట, మక్తల్ మినహా మిగతా అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీరి జాబితాను వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. నారాయణపేటలో ఎర్రశేఖర్, కుంభం శివకుమార్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా.. ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసే దాన్ని బట్టి మక్తల్‌లో అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మక్తల్‌లో వాకిటి శ్రీహరి, నాగరాజు గౌడ్, కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
హస్తం, కమలం ఆశావహుల్లో ఆందోళన..
కాంగ్రెస్, బీజేపీలో అసెంబ్లీ అభ్యర్థిత్వాల ఖరారులో జాప్యం జరుగుతుండడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి..అహర్నిశలు శ్రమించామని.. పెద్ద మొత్తంలో ఖర్చులు భరించామని.. ఇప్పడు టికెట్ కోసం నిరీక్షించాల్సి రావడం నిద్ర లేకుండా చేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ల ఖరారుతో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రతి రోజు జాతరలా ఊరూరా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తుండడం.. కోడ్ కూసేలోపు అన్ని మండలాలు, గ్రామాలను చుట్టేసేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతుండడం కాంగ్రెస్, బీజేపీ ఆశావహులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలో ఖరారు కాని అభ్యర్థిత్వాలు.. ఇంకా సస్పెన్స్!
బీజేపీ.. తొలి జాబితాలో నలుగురే..
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమాగా ఉన్న బీజేపీ పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంఖారావాన్ని పూరించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. పార్టీ చరిత్రలో తొలిసారిగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. పెద్దమొత్తంలో వచ్చాయి.
కానీ క్షేత్రస్థాయిలో నాలుగైదు స్థానాల్లో తప్ప మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలు పరిశీలిస్తే అంతంతమాత్రంగానే ఉన్నట్లు గ్రహించిన అధిష్టానం పూర్తిస్థాయిలో జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. వారంలోపు రాష్ట్రవ్యాప్తంగా తొలి జాబితా విడుదల చేసేలా బీజేపీ ముఖ్య నేతలు ముందుకు సాగుతుండగా.. ఇందులో ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండనున్నట్లు సమాచారం. కల్వకుర్తి ఆచారి, గద్వాల డీకే అరుణ, దేవరకద్ర డోకూరు పవన్‌కుమార్, కొల్లాపూర్ సుధాకర్‌రావు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment