
దేవరకద్ర–కృష్టా మార్గంలో పూర్తయిన విద్యుదీకరణ
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నుంచి నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వేస్టేషన్ వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్–మునీరాబాద్ రైల్వేలైన్‌లో భాగంగా ఇటీవల చేపట్టిన బ్రాడ్ గేజ్ లైన్ పనులు పూర్తి కావడంతో డెమో రైలును ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకుగాను దేవరకద్ర నుంచి మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణా రైల్వేస్టేషన్ వరకు 64 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు శరవేగంగా పూర్తి చేశారు.
దీంతో హైదరాబాద్ నుంచి రాయచూర్, గుంతకల్, బళ్లారి, హుబ్లీ, గోవా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలకు అత్యంత అందుబాటులో ఉండే మార్గంగా దేవరకద్ర–కృష్ణా రైల్వేలైన్ మారబోతోంది. దాదాపు అన్ని రూట్లకు వంద కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రూట్‌లో డెమో ప్యాసింజర్ రైలుతో పాటు గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు. ఈ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇనుప ఖనిజం, సిమెంట్, ఉక్కు వంటి భారీ వస్తువులను రవాణా చేసే అవకాశం ఉంది. ఈ మార్గంలో త్వరితగతిన విద్యుద్దీకరణ పూర్తి చేసిన నిర్మాణ, ఎలక్ట్రిక్ విభాగాల అధికారులను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ అభినందించారు.