ఎట్టకేలకు దొరికాడు
గద్వాలలో కలకలం..
నకిలీ సర్టిఫికెట్లతో ఏఈఓగా ఉద్యోగం పొందడమేగాక.. ఏకంగా ఐదేళ్లు విధులు నిర్వహించాడనే వార్త జిల్లాలో కలకలం రేపింది. ఇన్నేళ్లు పనిచేసినా ఉన్నతాధికారులు గుర్తించడంలో విఫలమయ్యారా.. లేక తెలిసే మనకెందుకులే అనే తరహాలో వ్యవహరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తేనే ఉన్నతాధికారుల ముసుగులో ఉన్న దోషులు బయటపడతారు. దీనికితోడు గద్వాల వ్యవసాయ శాఖ అధికారులపైనా పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతేడాది రైతుబంధు డబ్బులు పెద్దఎత్తున లేని రైతుల పేర్లతో నగదు కాజేసినట్లు బహిర్గతం కావడం ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది. తాజాగా నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం వెలుగులోకి రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. ఈ విషయాలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
● నకిలీ సర్టిఫికెట్‌తో ఏఈఓ ఉద్యోగం
● ఐదేళ్లు గద్వాల వ్యవసాయ శాఖలో విధులు
● అర్హత సర్టిఫికెట్లపరిశీలనలో విషయం వెలుగులోకి..
● గతేడాది చీటింగ్ కేసు నమోదు.. నాటి నుంచి అజ్ఞాతంలోనే ఏఈఓ
● తాజాగా
నాగర్‌కర్నూల్ జిల్లాలో అదుపులోకి
తీసుకున్న పోలీసులు
గద్వాల క్రైం: నకిలీ డిప్లొమా సర్టిఫికెట్‌తో ఏఈఓ ఉద్యోగం పొందడంతోపాటు.. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఓ వ్యక్తి 2012– 2015 వరకు ఉత్తరప్రదేశ్ గాజీపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమా చదివినట్లు నకిలీ సర్టిఫికెట్ పొందాడు. 2017లో ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఏఈఓ (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ వ్యవసాయ అధికారి)గా ఉద్యోగం సాధించాడు. అనంతరం 2017 నుంచి 2023 వరకు జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఏఈఓగా ఐదేళ్లపాటు విధులు నిర్వహించాడు.
వెలుగులోకి వచ్చిందిలా..
ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అర్హత సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయ గుర్తింపును పునఃపరిశీలన చేపట్టింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ విభాగం పలువురు ఉద్యోగుల అర్హత, ఎక్కడ చదివారు అనే విషయాలపై కూపీ లాగారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందినట్లు గుర్తించి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందజేశారు. దీంతో సంబంధిత అధికారులు మల్దకల్ మండలం క్లస్టర్‌గా అచ్చంపేటకు చెందిన వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో కొలువు పొందినట్లు నివేదిక ఆధారంగా 2024 మార్చిలో సదరు వ్యక్తిపై 417, 420, 465, 468, 471 సెక్షన్ల కింద పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎట్టకేలకు నమ్మదగిన సమాచారం మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించి సోమవారం గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో ముఠా సభ్యులు
నకిలీ సర్టిఫికెట్ల తయారీలో మిర్యాలగూడకు చెందిన పలువురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వారిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లేని విశ్వవిద్యాలయాల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వేలాది మందికి డిప్లొమా సర్టిఫికెట్లు అందించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఈ ముఠా సభ్యులు నకిలీ సర్టిఫికెట్లు అందజేసి ఉండవచ్చనే అనుమానం మేరకు పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ముఠా అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం
నకిలీ సర్టిఫికెట్లతో ఓ వ్యక్తి గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందినట్లు గతేడాది రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాం. అయితే, నాటి నుంచి సదరు వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలో ఎంతమంది ఉన్నారు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. – శ్రీను సీఐ, గద్వాల
ఎట్టకేలకు దొరికాడు
Comments
Please login to add a commentAdd a comment