విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధునాథన వసతులు కల్పిస్తూ బాలికల హాస్టల్ నిర్మించేందుకు పీఎం ఉషా పథకం కింద రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, కనీస వసతులు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రధానంగా కళాశాలలు, పాఠశాలల్లో వసతుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. జిల్లాకేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పక్కనే హాస్టల్ వసతి కల్పిస్తే మరిన్ని అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, నాయకులు సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment