ఆశావహుల జేబుకు చిల్లు
పల్లెపోరులో జాప్యంతో కలవరపాటు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ప్రక్రియ డైలీ సీరియల్ మాదిరి సాగుతూ వస్తోంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల్లో కలవరపాటు మొదలైంది. గతేడాది జనవరి 31న పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం మొదట్లో పల్లెపోరును దసరా పండుగ తర్వాత నిర్వహిస్తామని తెలిపి.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సంక్రాంతికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సైతం చేసింది. అయినా నేటికీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోవడం గమనార్హం. మరోపక్క ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు నానా తంటాలు పడుతున్నారు. నిత్యం దావత్‌ల పేరుతో ఖర్చు తడిసి మోపెడవుతుందని వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 423 గ్రామ పంచాయతీలు ఉండగా.. అందులో సర్పంచ్ పదవికి పోటీ చేసే వారి సంఖ్య గణనీయంగానే ఉందని ప్రాథమిక అంచనా.
గ్రూప్ రాజకీయలతో పరేషాన్..
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ఈ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండటంతో వర్గాలుగా విడిపోయారు. అదిగో.. ఇదిగో.. ఎన్నికలంటూ ప్రభుత్వ ప్రకటనలతో గ్రామాల్లో వేడెక్కిన వాతావరణం.. వాయిదాల పర్వంతో తర్వాత ఒక్కసారిగా స్తబ్ధుగా మారింది. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు రెండు నుంచి మూడు వర్గాలుగా విడిపోయి లాబీయింగ్ మొదలుపెట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నడిపించిన నాయకులు ఒక వర్గంగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పెద్దల హామీలతో కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు మరోవర్గంగా ఏర్పడి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక చోట కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మనకే టికెట్ అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా.. గ్రామాన్ని సక్రమంగా పాలించే మంచి నాయకుడు పోటీలో ఉంటే గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతుంది.
దసరా నుంచి సాగదీతతో
ఆర్థికంగా నష్టం
నిత్యం దావత్‌ల పేరుతో తడిసిమోపెడు
జిల్లాలో 423 గ్రామ పంచాయతీలు
ఇక నువ్వే సర్పంచ్..
గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్న ఆశావహులు కొన్ని నెలలుగా మద్దతుదారులను వెంటపెట్టుకుని స్థానికంగా హల్‌చల్ చేస్తున్నారు. మధ్యాహ్నం వెంట తిరగడం.. రాత్రికి దావత్ చేసుకోవడం వంటి కార్యక్రమాలు పల్లెల్లో జోరుగా సాగుతున్నాయి. ‘ఇక నువ్వే సర్పంచివి.. నీకు తిరుగులేదు’ అంటూ పొగడ్తలతో ఆశావహులను ఆకాశానికి ఎత్తి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇంకా ముందుకు సాగదీస్తే మాత్రం ఆశావహులు అప్పుల పాలు కావాల్సిందే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం పల్లెపోరు ఎప్పుడు నిర్వహిస్తుందో.. వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment