జైలు అదాలత్‌లో ఆరు కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

జైలు అదాలత్‌లో ఆరు కేసులు పరిష్కారం

Published Sun, Feb 23 2025 1:01 AM | Last Updated on Sun, Feb 23 2025 12:59 AM

జైలు

జైలు అదాలత్‌లో ఆరు కేసులు పరిష్కారం

పాలమూరు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలులో శనివారం జైలు అదాలత్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు న్యాయమూర్తి కె.మమతారెడ్డి హాజరై జైలు అదాలత్‌లో మొత్తం ఆరు కేసులు పరిష్కరించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వారిపై మోపబడిన నేరాన్ని ఒప్పుకోవడంతో వారు అనుభవించిన జైలు శిక్ష కాలాన్ని తీసివేసి.. కొంత కాలం శిక్ష పూర్తి అయిన తర్వాత వారిని విడుదల చేయాలని జైలు అదాలత్‌లో ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో న్యాయమూర్తులు ఉపాధ్యాయ్‌, విజయ్‌కుమార్‌, దరావత్‌ ఉదయ్‌నాయక్‌, సయ్యద్‌ జకీయా సుల్తా నా, మహ్మద్‌ ఉమర్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్చి 25న ప్రాంతీయ పోస్టల్‌ పెన్షన్‌ అదాలత్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: వచ్చే నెల 25న వీసీ ద్వారా హైదరాబాద్‌ ప్రాంతీయ పోస్టల్‌ పెన్షన్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు మహబూబ్‌నగర్‌ డివిజనల్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ విజయజ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ రీజియన్‌ కార్యాలయం పోస్టుమాస్టర్‌ జనరల్‌ వద్ద ఉంటుందన్నారు. ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు వచ్చేనెల 20 చివరి తేదీ అని చెప్పారు.

పీయూలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: పాలమూరు యూనివర్సిటీలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్‌ మైనార్టీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శనివారం వీసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఉర్దూ భాష సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు, స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు పీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ అని, పీయూలో ఉర్దూ విభాగం లేకపోవడంతో ఏటా వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ డిగ్రీ మహిళా కళాశాల, ఎంవీఎస్‌ కళాశాలల్లో ప్రతి ఏడాది 400 మందికిపైగా ఉర్దూ గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణులవుతున్నారని, దీంతో ఎంఏ, పీహెచ్‌డీ అందుబాటులో లేకపోవడంతో చాలామంది పై చదువు చదవలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో ఆల్‌మేవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అబ్దుల్‌ వహీద్‌షా, రాష్ట్ర కోశాధికారి మహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌, జిల్లాశాఖ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్‌ ఖలీల్‌, సలహాదారులు యూసుఫ్‌ బిన్‌ నాసర్‌, సయ్యద్‌ ఖాజా నిజాముద్దీన్‌, షంసుద్దీన్‌ పాల్గొన్నారు.

‘రాజాపూర్‌ ఘటన’పై బదిలీ వేటు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/ రాజాపూర్‌: జిల్లాలోని రాజాపూర్‌ కేజీబీవీలో కొన్ని రోజులుగా సీఆర్టీల మధ్య గొడవ, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం, భోజనం సరిగా పెట్టకపోవడం వంటి అంశాలపై తీవ్రస్థాయి లో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారాలపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు ప్రచురితమ య్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీ విజయలక్ష్మి విచారణ చేపట్టారు. విచారణ రిపోర్టును కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆమె శనివారం చర్యలకు ఉపక్రమించారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి పావనిని దేవరకద్ర కేజీబీవీకి బదిలీ చేయగా.. దేవరకద్ర ప్రత్యేకాధికారిని రాజాపూర్‌కు బదిలీ చేశారు. సీఆర్టీ మంజులను మిడ్జిల్‌, మరో సీఆర్టీ సుకీర్తిని చిన్నచింతకుంటకు బదిలీ చేసినట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటనపై విద్యాశాఖ ఆధ్వర్యంలో మరోసారి పూర్తిస్థాయిలో సూపరింటెండెంట్‌, అడిషనల్‌ డైరెక్టర్‌, రాజాపూర్‌ ఎంఈఓ ఆధ్వర్యంలో మరో కమిటీ వేయనున్నారు. ఈ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే వీరిని విధుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల్లో చర్చ జరుగుతుంది.

వేరుశనగ @ రూ.7,044

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శనివారం వేరుశనగ క్వింటాల్‌ గరిష్టంగా రూ.7,044, కనిష్టంగా రూ.5,369 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు క్వింటాల్‌ సరాసరిగా రూ.5,822, పత్తి గరిష్టంగా రూ.6,262, కనిష్టంగా రూ.5,501, కందులు గరిష్టంగా రూ.7,149, కనిష్టంగా రూ.5,097, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,870, కనిష్టంగా రూ.5,001 ధర వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
జైలు అదాలత్‌లో  ఆరు కేసులు పరిష్కారం 
1
1/1

జైలు అదాలత్‌లో ఆరు కేసులు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement