‘నక్ష’తో వివాదాలకు చెక్
జడ్చర్ల టౌన్: ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు నక్ష ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నేషనల్ జియో నాలెడ్జ్ బేస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యబిటేషన్స్ (నక్ష) కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్‌ఆర్‌ఎంపీ)లో భాగంగా ‘నక్ష’ను చేపట్టారన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర రెవెన్యూ, పురపాలక శాఖల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల పూర్తి వివరాలన్నీ జియో స్పేషియల్ సాంకేతికతో సేకరించటంతోపాటు రెవెన్యూ రికార్డులను ఆధునికీకరించి పక్కాగా నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, కొడంగల్ పట్టణాలు ఉన్నాయని, ఇక్కడ ఏడాది పాటు పైలెట్ ప్రాజెక్టు అమలు చేశాక వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు,చేర్పులు చేసిన అనంతరం దశలవారీగా మిగతాపట్టణాల్లో అమలు చేస్తారన్నారు. సర్వే చేసిన తరువాత అభ్యంతరాలు స్వీకరించి నక్ష వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ సర్వేలో పాలుపంచుకొని క్షేత్రస్థాయిలో సర్వేకు వచ్చినపుడు అన్ని వివరాలు తెలపాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ ఆస్తులపై గొడవలు ఎక్కువగా ఉంటాయని, నక్ష సర్వేతో వీటికి పరిష్కారం లభిస్తుందన్నారు. ఇంటి యజమాని పేరు, ఆస్తిపన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబరు ప్లాన్, నల్లా కనెక్షన్ వంటి సమస్త వివరాలతో సర్వే చేస్తారన్నార.
పారదర్శకంగా ఆస్తిపన్ను ముదింపు
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ సర్వే పూర్తయితే ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకోవటానికి వీలవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వార్డు కౌన్సిలర్లు రమేష్, శశికిరణ్, నాయకులు రాంమోహన్, జన్నులక్ష్మణ్‌లు సందేహాలను వెలిబుచ్చారు. సర్వేలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు వారికి వివరించారు. అంతకుముందు కలెక్టర్ విజయేందిర బోయి డ్రోన్‌ను ఎగురవేసి లాంఛనంగా సర్వేను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, డీటీసీపి అదనపు డైరెక్టర్ రమేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి కిషన్‌రావు, మున్సిపల్‌కమీషనర్ లక్ష్మారెడ్డి, తహశీల్దార్ నర్సింగ్‌రావు, వైస్‌చైర్‌పర్సన్ పాలాది సారిక, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
పక్కాగా రెవెన్యూ రికార్డుల నిర్వహణ
కలెక్టర్ విజయేందిర బోయి
జడ్చర్లలో నక్ష సర్వే ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment