ఉదండాపూర్ నిర్వాసితుల ఆందోళన
జడ్చర్ల టౌన్: పాలమూరు ప్రాజెక్టులోని ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు, రైతుల పోరాటం రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. పది రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్న వారు బుధవారం పదుల సంఖ్యలో కావేరమ్మపేట వద్ద ఉన్న ప్రభుత్వ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. వినూత్నంగా నిరసన చేపట్టాలని నిర్ణయించి భిక్షాటన చేయాలని భావించారు. విషయం తెలుసుకున్న సీఐ కమలాకర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. అనుమతి లేదని.. గురువారం ఆర్డీఓ ఉదండాపూర్ గ్రామానికి వచ్చి మాట్లాడతారని చెప్పారు. అప్పటికీ అంగీకారం కుదరకుంటే అప్పుడు అనుమతిస్తామని నచ్చజెప్పారు. ఈ సమయంలో కాసేపు సీఐ, నిర్వాసితుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది.
రైతు ఆత్మహత్యాయత్నం..
భిక్షాటనకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని పోలీసులు తేల్చిచెప్పడంతో మల్లయ్య అనే రైతు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోగా గుర్తించిన పోలీసులు వెంటనే అతడిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా భిక్షాటన చేస్తామని నిర్వాసితులు పోలీసులతో వాదనకు దిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో జడ్చర్ల పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీకి అనుమతించారు. నిర్వాసితులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అతిథిగృహం నుంచి స్టేషన్ వరకు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో భిక్షాటన చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని డీఎస్పీ హెచ్చరించినా వారు వినలేదు. గురువారం భిక్షాటన చేసి తీరుతామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భిక్షాటనకు యత్నం..
అడ్డుకున్న పోలీసులు
ఉదండాపూర్ నిర్వాసితుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment