ఇల్లు మా పేరిట రిజిస్ట్రేషన్ చేయించండి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆ వృద్ధ తల్లిదండ్రులకు తొమ్మిది మంది సంతానం.. వీరిలో ఐదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు చేసిన వారు చివరికి తమకున్న స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు గతంలో బ్యాంకు రుణం వస్తుందని భావించి మూడో కొడుకుకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కొన్నాళ్లకు అతను తన అక్కకు బదిలీ చేయగా.. ఆ వృద్ధులను ఇప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో లబోదిబోమంటున్నారు. తమ గోడును బుధవారం నగర వయోవృద్ధుల సంక్షేమ కమిటీ ఎదుట వెళ్లబోసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని వీరన్నపేటకు చెందిన లక్ష్మమ్మ (65), సామర్ల రంగయ్య (70) దంపతులకు స్థానికంగా 133 గజాల స్థలం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం తమకున్న అందులో మూడో కుమారుడు దత్తు బ్యాంకు ఉద్యోగి కావడంతో రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకునేందుకు అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఇటీవల కుటుంబసభ్యుల సమ్మతి లేకుండానే తన అక్క వితంతువు తిరుపతమ్మ (స్టాఫ్‌నర్స్)కు మార్పిడి చేయించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలనను మాత్రం ఎవరూ సరిగ్గా చూడటం లేదు. చివరకు ఇంటి మేడపైన ఉన్న సింగిల్ బెడ్‌రూంలో దివ్యాంగుడైన చివరి కుమారుడు రాజు వద్ద ఉంటున్నారు. ఈయనతో పాటు భార్యాపిల్లలు, వృద్ధ దంపతులకు ఏమాత్రం గదులు సరిపోక అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే వరండాలో చుట్టూ డే రాలు వేసుకుని నివసిస్తున్నారు. ఇప్పటికై నా ఈ ఇంటిని తమ పేరిట మార్పిడి చేయించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని అధికారులకు విన్నవించారు. స్పందించిన నగర వయోవృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ డి.మహేశ్వర్‌రెడ్డి, కమిటీ కన్వీనర్ సీడీపీఓ రాధిక, వన్‌టౌన్ సీఐ ఎం.అప్పయ్య, డా.మహమ్మద్ అస్గర్ అలీ, జి.నాగభూషణం, కె.జయప్రద సమా వేశమయ్యారు. ఈకేసుకు సంబంధించిన కుటుంబసభ్యులందరినీ పిలిపించి పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈనెల 23వ తేదీ వరకు తమకు గడువు ఇవ్వాలని, తమ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఒక అంగీకారానికి వస్తామని అధికారులకు కుటుంబసభ్యులు తెలిపారు.
● మమ్మల్ని కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు
● వయోవృద్ధుల సంక్షేమ కమిటీకి తల్లిదండ్రుల వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment