ఉపాధి హామీలో సీసీ రోడ్లు మంజూరు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరం 2024–25కు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు 223 సీసీ రోడ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10.022 కోట్లు మంజూరు చేసింది. ఆయా గ్రామాల్లో పనులను గుర్తించి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టేలా పరిపాలనా అనుమతులిచ్చింది. సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసిన జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్(డీసీసీ) అధికారులు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. మార్చి నెలాఖరులోగా పనులు పూర్తి చేసి బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణ పనులపై దృష్టి సారించారు. రోడ్ల నిర్మాణాలు నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేంద్రిబోయి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
● జిల్లాలో అత్యధికంగా దేవరకద్ర నియోజకవర్గంలో 85 సీసీరోడ్ల నిర్మాణానికి రూ.3.695 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 27 సీసీరోడ్ల నిర్మాణానికి రూ.1.20 కోట్లు, జడ్చర్లలో 72 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3.157 కోట్లు, పరిగి నియోజకవర్గం పరిధిలోని గండేడ్, మహమ్మదాబాద్ మండలాల్లో 30 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.34 కోట్లు, నారాయణపేట నియోజక వర్గం పరిధిలోని కోయిలకొండ మండలంలో 9 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.63 లక్షలు మంజూరయ్యాయి.
● ఉపాధి హామీ చట్టం ప్రకారం నిర్ధిష్టమైన ప్రణాళికతో జిల్లాను యూనిట్‌గా తీసుకొని మొత్తం ఖర్చులో 60 శాతం కూలీలకు, 40 శాతం సామగ్రి కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చుకనుగుణంగా పనులను చేపట్టేలా జిల్లాస్థాయిలో డీసీసీ అధికారుల పర్యవేక్షణలో సీసీ రోడ్డు పనులు చేపడుతారు.
జిల్లాలో 223 రోడ్ల నిర్మాణానికి రూ.10కోట్లు
అంచనాలు సిద్ధం చేసిన అధికారులు
మార్చి నెలాఖరు లోగా
పూర్తి చేసేలా చర్యలు
Comments
Please login to add a commentAdd a comment