చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టండి
నారాయణపేట: నారాయణపేట నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దివంగత చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టేందుకు పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ, రాజస్తాన్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారన్నారు. మారుమూల ప్రాంతంలో మెడికల్ కళాశాలను ప్రారంభించుకోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందో తెలుస్తోందన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలో తిరస్కరించారని, కానీ ప్రభుత్వం వాటిని తిరిగి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేసిందన్నారు. తండాల్లో, గూడాల్లో, గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించాలని ముందుకు సాగుతుందన్నారు. టీచింగ్, నాన్‌టీచింగ్ లేకుండా గొప్ప డాక్టర్లు కావడం అనేది కష్టమని, మేము ఎంత చేసినా ఇన్‌ఫ్రాస్టక్చర్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదు.. నిజమైన పేదవారికి సంక్షేమ ఫలాలు అందించాలని, చదువుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడారు. అంతకు ముందు ఉమ్మడి జిల్లా పరిధిలోని పోలేపల్లి ఎల్లమ్మదేవిని ముఖ్యమంత్రి, మంత్రులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
నిధులు మేమిస్తాం.. నిర్వహణ మీరు చేపట్టండి
నిధులు మేమిస్తాం.. నిర్వహణ మీరు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు భరోసానిచ్చారు. పెట్రోల్‌బంకును ప్రారంభించిన అనంతరం మహిళా సంఘాల సభ్యులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. 600 బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దెకు ఇవ్వడం జరిగిందని, సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నామన్నారు. కోటి మంది మహిళలతో హైదరాబాద్ రింగ్‌రోడ్డులో ప్రదర్శన నిర్వహించబోతున్నామన్నారు.
సీటు వస్తుందో..
రాదో అనుకున్నా
మాది రైతు కుటుంబం. ఎంతో కష్టపడి మా తల్లిదండ్రులు చదివించారు. నాకు ఎంబీబీఎస్ సీటు వస్తుందో రాదో అనుకున్నా. రాష్ట్రంలో 8 కొత్త కళాశాలు రావడంతో నాకు సీటు వచ్చింది. తక్కువ సమయంలో మారుమూల ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి ల్యాబ్స్, ఫ్యాకల్టీ ఇతర సదుపాయలను కల్పించారు. ఈ కళాశాలను తీసుకురావడానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. – శ్రీధర్, దేవరకొండ గ్రామం,
నల్లగొండ జిల్లా
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడంలో ప్రత్యేకంగా ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కళాశాలలో నర్సింగ్ కోర్సు చేస్తున్నాను. ఈ కోర్సు పూర్తి చేసి నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తా.
– నవనీత, నర్సింగ్ విద్యార్థిని, వికారాబాద్
అదృష్టంగా భావిస్తున్నాం
నేను పారా మెడికల్ కళాశాలలో ఈసీజీ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. మా జిల్లాలో నూతనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించడంతో ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలైనట్లయ్యింది. ఇంతకుముందు ఈసీజీ లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి చూయించుకునే వారు. ప్రభుత్వం మారుమూల ప్రాంతమైన ఈ నారాయణపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.
– సాయిమాధురి, ఈసీజీ స్టూడెంట్,
పారామెడికల్ కళాశాల, నారాయణపేట
ఉపాధి పొందుతున్నా..
ఎమ్మెల్యే చిట్టెం పర్ణికమ్మ, ఎంపీ అరుణమ్మ ఇద్దరూ మా ఊరు ధన్వాడ ఆడపడచులు. నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సార్. నా సొంతంగా జొన్న, రాగి రొట్టేల వ్యాపారం చేస్తున్నా. మహిళా సంఘం సభ్యురాలిగా ఉన్నా. నా భర్త 2011లో చనిపోయారు. పిల్లలను పోషించుకునేందుకు ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసి రూ.5 వేలు సంపాదించేదానిని. కానీ మహిళా సంఘంలో రుణం పొంది ఈ రోజు నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నా.
– రాజేశ్వరి,
మహిళా సంఘం సభ్యురాలు, ధన్వాడ
సీఎం పర్యటన సాగిందిలా..
నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నారాయణపేట జిల్లాలో 3 గంటల 15 నిమిషాల పాటు సాగింది. పర్యటనలో భాగంగా దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించారు.
● మధ్యాహ్నం 2.05 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా పోలేపల్లి నుంచి నారాయణపేట మండలం సింగారం గేటు సమీపంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు సీఎం చేరుకున్నారు.
● 2.09 గంటలకు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడారు.
● 2.38 గంటల అక్కడి నుంచి బయలుదేరి 2.48 గంటలకు అప్పక్‌పల్లి దగ్గర ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
● 3 గంటలకు మెడికల్ కళాశాల వద్దకు చేరుకొని కళాశాలను ప్రారంభించారు. 3.35 గంటల వరకు మెడికల్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడారు.
● 3.40 గంటలకు బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, సీతక్క, జూపల్లి కృష్ణరావు, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.
● 4.18 గంటల వరకు దాదాపు 40 నిమిషాల పాటు సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
● సాయంత్రం 5.20 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలు దేరారు.
ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన
మెడికల్ కళాశాల విద్యార్థులతో సీఎం ముఖాముఖి
చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టండి
చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టండి
చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టండి
చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టండి
Comments
Please login to add a commentAdd a comment