రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Published Sat, Feb 22 2025 12:54 AM | Last Updated on Sat, Feb 22 2025 12:53 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

ఊట్కూరు: ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఊట్కూరుకు చెందిన కల్వాల్‌ ఖయ్యూం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో కర్ణాటకలోని గుల్బరకు వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామానికి వస్తుండగా.. మండల కేంద్రంలో రోడ్డుపై అడ్డుగా గుర్రాలు రావడంతో సడన్‌బ్రేక్‌ వేశారు. దీంతో కారు ముందుభాగంలో కూర్చున్న కల్వాల్‌ ఖయ్యూ కుమారుడు అబ్దుల్‌ ఆది (7) డ్యాష్‌బోర్డుకు బలంగా తలగడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ బాలుడు గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కేఎల్‌ఐ కాల్వలో పడి యువకుడు..

ఉప్పునుంతల: మండలంలోని తాడూరు–చెన్నారం మార్గమధ్యంలో కొత్తగా తవ్వుతున్న కేఎల్‌ఐ కాల్వలో పడి కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన సంబు వినోద్‌గౌడ్‌ (26) మృతిచెందినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. వినోద్‌గౌడ్‌ గురువారం స్వగ్రామం నుంచి తాడూరులోని బంధువుల ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. రాత్రి తాడూరు నుంచి చెన్నారం వైపు వెళ్తుండగా.. మార్గమధ్యంలో రోడ్డుపై తవ్విన కేఎల్‌ఐ కాల్వలో బైక్‌తో సహా పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి సుల్తాన్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

తెలకపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్‌ వివరాల మేరకు.. ఆలేరుకు చెందిన భాషమోని యాదగిరికి నాలుగేళ్ల క్రితం పెద్దముద్దునూరుకు చెందిన శివలీల (24)ను ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివలీల భర్త యాదగిరి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపనికి గురైన శివలీల.. గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి పిట్టల యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

లింగాల: మండలంలోని అంబట్‌పల్లి సమీపంలో గురువారం రాత్రి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ నాగరాజు శుక్రవారం తెలిపారు. అంబట్‌పల్లి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామని.. ఇసుక తరలిస్తున్న గోవిందు, రాముపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

కేసు నమోదు

లింగాల: మండలంలోని అవుసలికుంట సమీపంలో నిలిపిన గొర్రెల మంద నుంచి గురువారం ఒక గొర్రెను దొంగిలించి ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా గస్తీ తిరుగుతున్న పోలీసులు పట్టుకున్నారని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. గొర్రెను తరలిస్తున్న రమేశ్‌, మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

పశువుల

కంటైనర్‌ పట్టివేత

జడ్చర్ల: కంటైనర్‌లో గుట్టుగా తరలిస్తున్న 36 పశువులను మండలంలోని గొల్లపల్లి శివారులో శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. పశువులను అనంతపూర్‌కు తరలిస్తున్నారని.. డ్రైవర్‌ రాంషీద్‌ పున్నోలిని అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న పశువులను హన్వాడ మండలం చిన్నదర్పల్లి శివారులో ఉన్న గోశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు.

షాబాద్‌లో

కిరాణ దుకాణం దగ్ధం

ఇటిక్యాల: విద్యుదాఘాతంతో కిరాణ దుకాణం దగ్ధమైన ఘటన శుక్రవారం మండలంలోని షాబాద్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్‌, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాధమ్మ కిరాణం దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న సుమారు రూ.70 వేల సామగ్రి కాలి బూడిదయ్యాయని బాధితురాలు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి 
1
1/1

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement