వనపర్తి: రైతులు సాగునీరు అడిగితే.. కాంగ్రెస్ నాయకులు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కేటాయింపుల విషయంలో మొదటి నుంచి తెలంగాణకు అన్యాయమే జరిగిందని.. గత పాలకులు పక్షపాత ధోరణి ప్రదర్శించారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి గ్రామగ్రామాన తిరిగి ప్రజానికాన్ని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి, పాలమూరు–రంగారెడ్డి పనులను చివరి దశకు తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నది జలాల వాటా తేల్చాలని అప్పటి కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా పదేళ్లుగా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. నది జలాల వాటాను తేల్చని కేంద్రాన్ని ఏమీ అనలేక గత పాలకుల నిర్లక్ష్యం అనడం కాంగ్రెస్ పాలకుల విజ్ఞతకే వదిలేస్తున్నమన్నారు. నది జలాల వాటా తేల్చకపోతే కేంద్రంపై యుద్ధం చేస్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారని.. తెలంగాణ ప్రజల తరుఫున ప్రతిపక్ష హోదాలో ఉన్న తమ పార్టీ మద్దతు తెలుపుతుందని దీక్షలు, పోరాటాలు చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, మాణిక్యం, జోహెబ్, రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment