డ్రోన్లతో సాగు సులభం | - | Sakshi
Sakshi News home page

డ్రోన్లతో సాగు సులభం

Published Thu, Mar 20 2025 1:03 AM | Last Updated on Thu, Mar 20 2025 1:02 AM

డ్రోన

డ్రోన్లతో సాగు సులభం

పాన్‌గల్‌: అన్నదాతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అందుబాటులోకి వస్తుండటంతో కాస్త ఊరట కలిగిస్తుంది. వరి, వేరుశనగ, పత్తి, కంది తదితర పంటలకు డ్రోన్‌తో మందులు పిచికారీ చేస్తుండడంతో భారం తగ్గింది. వేగంగా పనులు పూర్తి చేయడం, తక్కువ ధరకే ప్రక్రియ పూర్తికావడంతో.. చాలా మంది రైతులు అటువైపుగా ఆసక్తి చూపుతున్నారు.

రసాయనిక మందుల ఆదా..

డ్రోన్‌ సహయంతో మందు పిచికారీ చేయడంతో రసాయనిక మందులు ఆదా అవుతున్నాయి. డ్రోన్‌తో నాలుగు నుంచి ఐదు నిమిషాల్లోనే ఎకరాకు మందు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. ఎకరానికి సరిపోయే మందు రెండెకరాలకు వస్తుంది. కూలీల ఖర్చులు తప్పుతున్నాయి. డ్రోన్‌తో పిచికారీ కోసం ఎకరానికి రూ.450 నుంచి రూ. 500 తీసుకుంటున్నారు. ఒక రోజుకు 20 నుంచి 30 ఎకరాల వరకు మందులు పిచికారీ చేసుకునే అవకాశం ఉండడంతో కూలీల కొరతను అధిగమించొచ్చు. దీంతో గ్రామాల్లో యువకులు సొంతంగా డ్రోన్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతూ స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. ఖర్చులు తగ్గి రైతులకు మేలు కలగడంతో యువతకు ఉపాధి లభించినట్లవుతుంది. మండలంలో అత్యధిక ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుండడంతో డ్రోన్లు కొనుగోలు చేసిన వారికి అన్ని కాలాల్లోనూ పని దొరుకుతుంది.

చేతిపంపులతో ఇలా..

రైతులు ఎక్కువగా చేతిపంపు, ఛార్జింగ్‌ పంపు, పెట్రోల్‌తో నడిచే పంపులతో పంటలకు మందు పిచికారీ చేస్తుంటారు. ఎకరం పొలానికి మందు పిచికారీ చేయాలంటే గంట నుంచి రెండు గంటల వరకు సమయం పడుతుంది. నాలుగైదు ఎకరాలు ఉంటే రోజంతా అవుతుంది. ఎకరానికి 100 లీటర్లకు పైగానే నీరు అవసరం పడుతుంది. ఒకరు నీరు పోయడం మరొకరు మందు పిచికారీ చేయడం కోసం ఒక్కో కూలీకి రోజుకు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతుంది.

కూలీల సమస్యకు చెక్‌

రైతులు స్ప్రేయర్‌తో పురుగు మందు పిచికారీ చేయాలంటే సుమారు రూ.వెయ్యి వరకు ఖర్చుయ్యేది. డ్రోన్‌తో కూలీల బెడద తప్పింది. ఖర్చు కూడా సగానికి సగం తగ్గింది. దీంతో రైతులకు సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. డ్రోన్‌ బ్యాటరీ కొనుగోలు, వాహనం నిర్వహణకు రూ.10 లక్షల వరకు అవుతోంది. ఇది రైతులకు భారం కావడంతో ఆసక్తి గల యువకులు డ్రోన్లను కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు.

పల్లెల్లో అందిపుచ్చుకుంటున్న సాంకేతికత

డబ్బు, సమయం ఆదా

ఆసక్తి చూపుతున్న రైతులు

కొనుగోలు రాయితీ లేదు

రాయితీపై డ్రోన్‌ కొనుగోలు చేసే అవకాశం ప్రస్తుతం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రోన్ల కొనుగోలుకు రాయితీ వస్తే రైతులకు తెలియపరుస్తాం.

– రాజవర్ధన్‌రెడ్డి, ఏఓ, పాన్‌గల్‌

శ్రమ తగ్గింది

డ్రోన్‌తో పిచికారీ వల్ల ఐదెకరాల పొలం అరగంటలో పూర్తయింది. డ్రోన్‌తో అయితే పురుగు మందు పైరు మొదలు వరకు చేరుతోంది. తెగుళ్లు, చీడపీడల నియంత్రణ కొంత వరకు ఆశాజనకంగా ఉంది. డ్రోన్‌తో మందుల పిచికారీతో సమయం, డబ్బు కూడా అదా అవుతుంది.

– లింగాల రాములు, రైతు, పాన్‌గల్‌

డ్రోన్లతో సాగు సులభం 1
1/2

డ్రోన్లతో సాగు సులభం

డ్రోన్లతో సాగు సులభం 2
2/2

డ్రోన్లతో సాగు సులభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement