జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పరిష్కార 2013 చట్టంపై మహిళలందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మీటింగ్‌హాల్‌లో మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. పది అంత కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి పని ప్రదేశంలో ఒక అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు భద్రత లేకుండా పోతుందని.. అందుకే ఏమైనా సమస్యలు వచ్చిన వెంటనే న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించారు. లైంగిక వేధింపుల యు/ఎస్ 354ఐపీసీని ఇప్పుడు కొత్త చట్టం 74 బీఎన్‌ఎస్‌గా మార్చినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు జరిగితే వెంటనే అంతర్గత ఫిర్యాదు కమిటీలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని శాఖల్లో కూడా ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమాధికారి జరీనాబేగం మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కార్యాలయాల్లో 48 అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు ఫిర్యాదులను ఈ కమిటీల ద్వారానే పరిష్కరించినట్లు వివరించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా.. తమ వద్దకు రావచ్చని, తప్పనిసరిగా బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ అడిషనల్ పీడీ ముసాయిదా బేగం, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.